- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే
తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనని, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే ప్రజల గొంతుకగా మారాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ అన్నారు.

దిశ, ఘట్కేసర్ : తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనని, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే ప్రజల గొంతుకగా మారాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ అన్నారు. మంగళవారం ఘట్కేసర్ సర్కిల్ అంక్షాపూర్‌లోని రాక్ గార్డెన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రజలు కన్న కలలను సాకారం చేసే దిశగా బీజేపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. 1980లో స్థాపితమైన భారతీయ జనతా పార్టీ తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించడంలో కార్యకర్తల కృషే ప్రధాన కారణమని అన్నారు. ఒకప్పుడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైన పార్టీ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని చెప్పారు. దీనికి బూత్ స్థాయి కార్యకర్తల కఠోర శ్రమే కారణమని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, ఆ దిశగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2019, 2024 ఎన్నికల్లో 35 శాతం ఓట్లను సాధించడం ద్వారా తెలంగాణలో బీజేపీ తన ఉనికిని బలంగా చాటుకుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ విజయాల వెనుక కూడా కార్యకర్తల కృషి కీలకమైందన్నారు.
ప్రజల గొంతుకగా నిలవాలి..
తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే ప్రజల గొంతుకగా మారి, ఆ గొంతును వీధుల వరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. 2028 నాటికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసమే కారణమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేశామని, సమ్మక్క-సారలమ్మ పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను కూడా కేంద్రం చేపట్టిందని తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
తెలంగాణలో 'ఆర్ఆర్ పన్ను' వసూలు..
తెలంగాణ ప్రభుత్వం 'ఆర్ఆర్ పన్ను' ద్వారా ఢిల్లీ దర్బార్‌కు నిధులు తరలిస్తోందని ఆరోపించారు. వీధుల నుంచి శాసనసభ వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఈ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలే బీఆర్ఎస్ పతనానికి కారణమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాలను కొనసాగిస్తోందని విమర్శించారు. ముసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి వేదికగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.






