మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా మాయం

by Taduka Kalyani |

యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది.

మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా మాయం
X

దిశ, మాచారెడ్డి: యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది. రైతులు యూరియా తీసుకోకపోయినా, యాప్‌లో మాత్రం తీసుకున్నట్లు (Purchased) నమోదు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న రైతులు సింగిల్ విండో కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఇది యాప్‌లో సాంకేతిక లోపమా, లేక అధికారుల నిర్లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులను వివరణ కోరగా, యాప్‌లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, సింగిల్ విండో సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ అధికారి రామ్మోహన్ మంగళవారం మాచారెడ్డి సింగిల్ విండో కార్యాలయంలో విచారణ చేపట్టారు. సిబ్బంది ఇచ్చిన సమాధానాలతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. సుమారు 103 యూరియా బస్తాల గల్లంతు అంశంపై సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొరపాటు ఎక్కడ జరిగింది?

ఫర్టిలైజర్ యాప్ ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మాచారెడ్డి ఘటనలో అసలు తప్పిదం ఎక్కడ జరిగిందన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. సిబ్బందికి యాప్‌పై సరైన అవగాహన లేకపోవడమా, లేక స్టాక్ నమోదులో నిర్లక్ష్యమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ-పాస్ యంత్రంలో స్టాక్ నమోదవుతున్నప్పటికీ, ఆధార్ ధృవీకరణ అనంతరం పంపిణీ వివరాలను సరిగా నమోదు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. యాప్‌లో 444 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్లు చూపించడంతో రైతులు స్లాట్‌లు బుక్ చేసుకోగా, కొంతమందికి యూరియా ఇవ్వకుండానే 'పర్చేస్డ్'గా నమోదు కావడంతో గందరగోళం నెలకొంది. యూరియా తీసుకోని రైతులకు మంగళవారం ఎరువును పంపిణీ చేసిన అధికారులు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కోఆపరేటివ్ అధికారి రామ్మోహన్ స్పష్టం చేశారు.

Next Story