- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ తెచ్చింది తాగుడు కల్చర్.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అనుకునేలా తమ ప్రభుత్వం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థిక సాయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శిల్పాకళా వేదికగా సీఎం విడుదల చేశారు. ఈ మేరకు తొలిరోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాలోకి రూ.2482.02 కోట్లు జమ కానున్నాయి. ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో సాగు పనులు మొదలయ్యే నాటికే రైతు భరోసాను అందిస్తున్నామని అన్నారు. గత 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పాలించారని, 19 మంది సీఎంలు చేసిన అప్పు రూ.60వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిన అప్పు రూ.8.11 లక్షల కోట్లు అయిందని పేర్కొన్నారు. రూ.8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలో మునిగిన తెలంగాణ రాష్ట్రాన్ని తనకు అప్పగించారని రేవంత్ రెడ్డి అన్నారు.
బడి పిల్లల బిల్లులు కూడా పెండింగే..
ఎన్నికల ముందు రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్ల అప్పు ఉంటుందని భావించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు తీస్తే.. గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయని కామెంట్ చేశారు. 2023లో సీఎస్ వంటి ఐఏఎస్‌లకే 1న జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. కొన్నేళ్లుగా జీతాలు వాయిదా పద్ధతిలో వస్తున్నాయని అధికారులే తమ వద్ద మొర పెట్టుకున్నారని గుర్తు చేశారు. బడి పిల్లల తిండి బిల్లులు కూడా వేల కోట్లు బకాయిలు పెట్టి పోయారని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. సర్పంచ్‌లకు వేల కోట్లు పెండింగ్ పెట్టిపోతే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. బిల్లులు పెండింగ్ పెట్టింది కేసీఆర్.. బద్నాం మోసింది తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులతో ఢిల్లీలో కూడా పరువుపోయే పరిస్థితి ఉందన్నారు.
అప్పులు చేసిన ఫామ్‌హౌస్‌లో పండలే..
నేను తప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకుని.. తప్పించుకుం తిరగట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూ.. ప్రజల మధ్యే ధైర్యంగా తిరుగుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశామని అన్నారు. రుణ మాఫీ కంద ఆరు నెలల్లోనే రైతుల ఖాతాల్లో రూ.22,600 కోట్లు జమ చేశామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని దుష్ప్రచారం చేశారని, సాగుకు ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్ హక్కని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వేల కోట్ల కమీషన్ల కోసమే ‘కాళేశ్వరం’..
రాష్ట్రంలో రైతులకు కేవలం ఉచిత కరెంట్ కోసం రూ.36 వేల కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ పనిముట్ల కోసం ఏటా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రైతు బీమా కోసం ఏటా రూ.3,500 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వేల కోట్ల కమీషన్ల కోసమే హడావుడిగా కాళేశ్వరం కట్టారని కామెంట్ చేశారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరం అయిందని అన్నారు. బోరు కింద పంట పండితే కూడా కాళేశ్వరం మహిమేనని మోసం చేశారని సీఎం ఫైర్ అయ్యారు. కూలిన కాళేశ్వరం నుంచి మూడేళ్లుగా చుక్కనీరు తీసుకోలేదని.. ఇవాళ వరిసాగులో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని అన్నారు.
ఒక్కసారైనా రైతు రుణమాఫీని పూర్తి చేశారా..
ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ మళ్లీ రావాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్.. ఒక్కసారైనా రైతు రుణమాఫీని పూర్తి చేశారని అని ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. కానీ, ఊరూరికి మాత్రం బెల్ట్ షాపులు తెచ్చి తాగులు కల్చర్ తెచ్చాడంటూ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు.






