చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది : కుమ్మరి చంద్రశేఖర్

by Batti.Sumithra |

చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు బలమైన పునాది అని పిట్లం సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ అన్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది : కుమ్మరి చంద్రశేఖర్
X

దిశ, పిట్లం (నిజాంసాగర్) : చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు బలమైన పునాది అని పిట్లం సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఫిజియోథెరపీ శిబిరాన్ని పిట్లం గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి, వారికి అందుతున్న ఫిజియోథెరపీ సేవలను పరిశీలించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి చికిత్స విధానం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు బలమైన పునాది. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను ప్రతి అర్హులైన చిన్నారికి చేరేలా అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలి.

ఫిజియోథెరపీ వంటి ప్రత్యేక వైద్య సేవలు అవసరమైన పిల్లలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వైద్యుల సూచనలు పాటించాలి అని అన్నారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరు. నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను తగ్గించవచ్చు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు.

ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొంటూ, ప్రతివిద్యార్థికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ దేవి సింగ్, బాలకృష్ణ, జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రోస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అద్నాన్, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story