భూమి, ధనం కంటే విద్యే శాశ్వత సంపద

by Ratna Kumari |

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కావేరి సీడ్స్ సంస్థ అధినేత గుండవరం భాస్కర్‌రావు మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు.

భూమి, ధనం కంటే విద్యే శాశ్వత సంపద
X

దిశ, భీమదేవరపల్లి : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కావేరి సీడ్స్ సంస్థ అధినేత గుండవరం భాస్కర్‌రావు మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.12 లక్షల విలువైన యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతులైన అస్రిత సాయికి రూ.1.20 లక్షలు, బొంతల సృజనకు రూ.1 లక్ష, గడిపె ఉత్తేజితకు రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.3.20 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా విద్యాభివృద్ధికి సంస్థ అందిస్తున్న సేవలను గ్రామస్థులు, విద్యావేత్తలు అభినందించారు.

ఈ సందర్భంగా గుండవరం భాస్కర్‌రావు మాట్లాడుతూ, 2015లో గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నప్పటి నుంచి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని తెలిపారు. "భూమి, ధనం శాశ్వతం కావు.. విద్యే జీవితాంతం మనతో ఉండే సంపద. విద్యార్థులే దేశ భవిష్యత్తు. పేదరికం ఏ చిన్నారి చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలతో పాటు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాం. గ్రామీణ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి" అని పిలుపునిచ్చారు.

గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గట్ల నర్సింగాపూర్‌లో కావేరి సీడ్స్ ఆధ్వర్యంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రావు విద్యార్థులతో మమేకమై వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు. యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కావేరి సీడ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గట్ల నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్, ఉపసర్పంచ్ బుడిగె శ్రీనివాస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. రమేష్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఎ. శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ రాంకిషన్, పీఈటీ వెంకన్న, ఉప్పుల సంపత్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story