- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కడున్నావ్ వరుణదేవా..!
ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసినా వరుణుడు కరుణించకపోవడంతో ఎండిపోతున్న పంటలను చూసి రైతుల గుండెలు తల్లడిల్లాయి. దీంతో జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం పల్లెపాడు గ్రామస్థులు తమ పూర్వీకుల సంప్రదాయాన్ని మరోసారి ఆచరిస్తూ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, అలంపూర్ : ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసినా వరుణుడు కరుణించకపోవడంతో ఎండిపోతున్న పంటలను చూసి రైతుల గుండెలు తల్లడిల్లాయి. దీంతో జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం పల్లెపాడు గ్రామస్థులు తమ పూర్వీకుల సంప్రదాయాన్ని మరోసారి ఆచరిస్తూ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రైతులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో కృష్ణానది తీరానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం 1001 బిందెల్లో కృష్ణా జలాలను సేకరించి, అక్కడే బొడ్డెమ్మలు ఏర్పాటు చేసి వర్షాలు కురవాలని ఆటలు, పాటలతో కృష్ణమ్మను వేడుకున్నారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, బాజాభజంత్రీల నడుమ 101 కాడెద్దులతో పవిత్ర జలాలను గ్రామానికి శోభాయాత్రగా తీసుకొచ్చారు. మహిళలు శివనామస్మరణ చేస్తూ భక్తిగీతాలు ఆలపించగా, గ్రామ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి.
గ్రామానికి తీసుకొచ్చిన కృష్ణా జలాలతో కాశీ విశ్వనాథ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామ దేవతలు, ఊరి బొడ్రాయికి శాంతి పూజలు చేసి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకలైన బిల్వం, రాగి, వేప చెట్లకు జలతర్పణం సమర్పించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. "ఇది నేటి ఆచారం కాదు.. తరతరాలుగా వస్తున్న మా గ్రామ సంప్రదాయం. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిన ప్రతిసారి కృష్ణమ్మ నీటితో గ్రామమంతా అభిషేకం చేస్తాం. ప్రతి ఏడాది ఈ పూజల అనంతరం వారం నుంచి పది రోజుల్లో వర్షాలు కురుస్తాయనే విశ్వాసం మాకు ఉంది. ఈసారి కూడా వరుణ దేవుడు కరుణిస్తాడనే నమ్మకం ఉంది" అని తెలిపారు. ఈ సంప్రదాయ వేడుకలో పురుషుల కంటే మహిళా రైతులు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని బిందెలతో నిర్వహించిన శోభాయాత్రను విజయవంతం చేశారు. ఈ అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టాన్ని చూసిన గ్రామస్థులు త్వరలోనే వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.






