వైన్ షాపులో కాంగ్రెస్ నాయకుల హల్‌చల్‌

by Ratna Kumari |

వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని సాయి సుధ వైన్ షాపులో ఆదివారం జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వైన్ షాపులో కాంగ్రెస్ నాయకుల హల్‌చల్‌
X

దిశ, అమరచింత : వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని సాయి సుధ వైన్ షాపులో ఆదివారం జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు వైన్ షాపులోకి చొరబడి, మద్యం కొనుగోలుకు వచ్చిన వారికి ఉచితంగా మద్యం పంపిణీ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. స్థానిక సమాచారం ప్రకారం, వైన్ షాపు యజమానిని చందా కోసం పలుమార్లు ఫోన్‌లో సంప్రదించగా, ఆయన డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ భర్త అరుణ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ శ్యామ్ తదితరులు వైన్ షాపులోకి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వారు అక్కడి సిబ్బందిని బెదిరించి కొంతసేపు షాపును తమ ఆధీనంలోకి తీసుకుని, మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి ఉచితంగా మద్యం పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడికి వచ్చిన మద్యం ప్రియులు మద్యం తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అధికార పార్టీకి చెందిన నాయకులపై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. వైన్ షాపులో జరిగిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story