- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గంజాయి వినియోగం, విక్రయం, రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.

దిశ, కొత్తగూడెం: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గంజాయి వినియోగం, విక్రయం, రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా లక్ష్మీదేవిపల్లి పోలీసులు గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతువాగు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో వారు గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం గంజాయి వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలపై వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..
భవిష్యత్తులో మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తూ, గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో పోలీసులు ఎలాంటి రాజీ పడబోరని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోవైపు మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






