- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజ్ఞాన్స్‌లో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా యూనిట్ సందడి
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ సోమవారం సినీ సందడితో కళకళలాడింది. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘‘శ్రీనివాస మంగాపురం’’ హీరో జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్ రషా తడాని యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు....

దిశ, చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ సోమవారం సినీ సందడితో కళకళలాడింది. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘‘శ్రీనివాస మంగాపురం’’ హీరో జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్ రషా తడాని యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా హీరో జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ, తన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో కనిపిస్తున్న ఉత్సాహం తనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. సినిమా రంగంలో అవకాశాల కంటే ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వమే విజయానికి మూలమని పేర్కొన్నారు. సినీ ప్రయాణం, చిత్రీకరణ అనుభవాలు, నటనలో ఎదురైన సవాళ్లు, క్రమశిక్షణ, అంకితభావం గురించి విద్యార్థులతో పంచుకున్నారు. ఏ రంగంలోనైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయాన్ని సాధించవచ్చని సూచించారు.
హీరోయిన్ రషా తడాని మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తన తొలి చిత్రం కావడం ఎంతో ప్రత్యేకమని, విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులతో గడిపిన సమయం మరపురానిదిగా నిలిచిపోతుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ (పి. కిరణ్) నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చందమామ కథలు పిక్చర్స్, వైజయంతి మూవీస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం, మాధవ్ కుమార్ గుల్లపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మోహన్‌బాబు, నరేష్, బ్రహ్మాజీ, షామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌కు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. వాసుబాబు, మంగా అనే యువజంట జీవితాల్లో చోటుచేసుకునే అనుకోని పరిణామాలు, తమ ప్రేమను నిలబెట్టుకునేందుకు వారు చేసే పోరాటం కథలో ప్రధానాంశంగా నిలుస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, యాక్షన్ అంశాలను మేళవించి చిత్రాన్ని తెరకెక్కించారు.
కార్యక్రమం అనంతరం హీరో జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్ రషా తడాని విజ్ఞాన్స్ వర్సిటీ విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. చిత్రబృందానికి విజ్ఞాన్స్ విద్యార్థులు ఘన స్వాగతం పలుకుతూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.






