ఏపీకి ఊరట..! తెలంగాణ వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

by Ramesh Naini |

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి అనుసంధాన పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది

ఏపీకి ఊరట..! తెలంగాణ వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి అనుసంధాన పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే.. ఏపీ ప్రభుత్వానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టకుండా తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బనకచర్ల ప్రాజెక్టు చట్టబద్ధ అనుమతులు లేకుండానే ముందుకు తీసుకెళ్తున్నారని.. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర జలహక్కులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు అమలైతే గోదావరి జలాల పంపిణీపై ప్రభావం పడటమే కాకుండా భవిష్యత్లో తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలు కూడా దెబ్బతింటాయని వాదించారు. అలాగే.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని కోర్టుకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) వంటి సంబంధిత సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందలేదని వాదించారు.

సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలి

అన్ని చట్టబద్ధ అనుమతులు పూర్తికాకముందే ప్రాజెక్టు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నందున సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ధర్మాసనం ఈ వాదనలను పరిశీలించిన అనంతరం ప్రస్తుతం దాఖలైన ప్రధాన పిటిషన్‌లోనే సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఆ లోపాలను సరిదిద్దకముందు పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒరిజినల్ సూట్‌కు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌లోని లోపాలు తొలగించకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయపరంగా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు.. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలిపింది. ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరించకముందే వారికి నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Next Story