ఫసల్ బీమా అమలు చేయాల్సిందే : ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Batti.Sumithra |

తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేసి రైతులకు భరోసా కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

ఫసల్ బీమా అమలు చేయాల్సిందే : ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేసి రైతులకు భరోసా కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా మారి రైతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

గతంలో అసెంబ్లీలో ఈ అంశాన్ని రెండుసార్లు ప్రస్తావించామని, బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించినప్పటికీ రైతుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఫసల్ బీమా అమలుకు ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశం ఉందని, రైతులు ప్రభుత్వం నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోతే రైతులతో కలిసి ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతు యాత్ర చేపట్టి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతుల హక్కుల సాధన కోసం అందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతులు రాందాస్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story