మత్స్యకారుల కన్నీళ్ళతో రాజకీయాలు వద్దు: జగన్‌కు అచ్చెన్న హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

విశాఖ సముద్రంలో గల్లంతయిన ఆరుగురు మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి నేడు విశాఖకు వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్ పై రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ..

మత్స్యకారుల కన్నీళ్ళతో రాజకీయాలు వద్దు: జగన్‌కు అచ్చెన్న హెచ్చరిక
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ సముద్రంలో గల్లంతయిన ఆరుగురు మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి నేడు విశాఖకు వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్ పై రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు అందాల్సిన పరిహారాలను సైతం పెండింగ్‌లో పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, నేడు విశాఖకు వచ్చి పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కన్నీళ్లు కనిపించని జగన్‌కు, ఇప్పుడు మాత్రం అకస్మాత్తుగా సానుభూతి గుర్తుకు వచ్చిందా అని మంత్రి ప్రశ్నించారు. ఆనాడు నష్టపరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధిత కుటుంబాలను పట్టించుకోని వారు, ఈరోజు పరామర్శ పేరుతో వస్తే ఆ కుటుంబాలు ఎలా నమ్ముతాయని నిలదీశారు.

ఐదేళ్లపాటు అవకాశం ఉన్నప్పటికీ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించకుండా, సంక్షేమ పథకాలకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వారి కన్నీళ్లపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి అన్నారు. నష్టపరిహారాలను పెండింగ్‌లో ఉంచిన వారు ఇప్పుడు బాధితులను పరామర్శిస్తే అది నిజమైన మానవత్వమా, లేక రాజకీయ ప్రదర్శనా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న 63 ఎక్స్‌గ్రేషియా క్లెయిమ్‌లకు సంబంధించిన రూ.3.15 కోట్లను 2024 జూలై 8న విడుదల చేశామని, అలాగే రూ.9.90 కోట్ల డీజిల్ (ఆయిల్) సబ్సిడీ బకాయిలను 2024 జూన్‌లోనే విడుదల చేసి మత్స్యకారులకు అందించామని తెలిపారు.

విద్యుత్ సబ్సిడీ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం జోన్–నాన్ జోన్ పేరుతో వేలాది మంది మత్స్యకారులను అన్యాయానికి గురి చేసిందన్నారు. 2018-19లో 52,946 మందికి విద్యుత్ సబ్సిడీ అందగా, వైసీపీ పాలనలో 2023-24 నాటికి అది 47,091 కలెక్షన్లకు పడిపోయిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోన్–నాన్ జోన్ అనే వివక్షను పూర్తిగా తొలగించి 54,033 కలెక్షన్లు పునరుద్ధరించడంతో పాటు, 2026లో మరో 12,500 కొత్త కలెక్షన్లు మంజూరు చేసి ప్రస్తుతం మొత్తం 62,181 సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు కల్పించామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.1,150 కోట్ల మేర సబ్సిడీ భారం భరిస్తోందని చెప్పారు. వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు అందించే భృతిని కూడా కూటమి ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిందని తెలిపారు. 2023-24లో 1,16,613 కుటుంబాలకు ప్రయోజనం అందగా, 2026-27లో 1,28,388 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున భృతి అందించామని వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణగా పరిహారాల చెల్లింపుల గణాంకాలను మంత్రి ప్రస్తావించారు. 2022-23లో 74 మరణాలు నమోదైనా కేవలం 31 అర్హులైన క్లెయిమ్‌లకే రూ.3.10 కోట్లు విడుదల చేశారని, 2023-24లో 45 మరణాలు నమోదైనా కేవలం నాలుగు క్లెయిమ్‌లను మాత్రమే పరిష్కరించి రూ.40 లక్షలు చెల్లించారని తెలిపారు. అప్పుడు న్యాయం చేయని గొడ్డలి పార్టీ అధ్యక్షుడు... ఇప్పుడు అండగా ఉంటానంటే ఆ మాటలకు ఎంత విలువ ఉంటుంది? ఓదార్పు కంటే ముందు బాధితులకు న్యాయం చేసిన చరిత్ర చూపించాలి. అదే ప్రజలు అడిగే మొదటి ప్రశ్న అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కోసం చేయాల్సిన పని చేయని జగన్, కూటమి ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేసి, సంక్షేమ పథకాలను పునరుద్ధరించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తర్వాత విశాఖకు వచ్చి ముసలి కన్నీళ్లు కార్చడం నిజమైన సానుభూతి కాదని, అది కేవలం రాజకీయ నాటకమేనని మత్స్యకారులే ప్రశ్నిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల విశ్వాసం మాటలతో కాదు... చేతలతోనే సంపాదించాల్సి ఉంటుందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story