పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఎక్కువ: చంద్రబాబు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తాను ముంబైలో కలిసి పరామర్శించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఎక్కువ: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తాను ముంబైలో కలిసి పరామర్శించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నిన్ననే నేను ముంబైకి వెళ్లి మన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కదా.. ఎక్కడికి బయటకు వచ్చినా తోపులాటలు కూడా అలాగే ఉంటాయి. సాధారణంగా రాజకీయ నాయకులు అందరికీ ఇలాంటివి జరుగుతుంటాయి కానీ, ఆయనకు (పవన్ కల్యాణ్‌కు) ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో ఆయన భుజం కొంత దెబ్బతినడం వల్ల ఆపరేషన్ చేయించుకున్నారు" అని సీఎం వివరించారు.

ఆరోగ్యం కూడా ముఖ్యం..

పవన్ కల్యాణ్‌ చాలా వేగంగా కోలుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తామిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ.. "నేను ఇప్పుడే పనిలోకి వచ్చేస్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ నేను వద్దు వద్దు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. రాజకీయం ముఖ్యం.. అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని ఆయనకు హితవు పలికాను అని చంద్రబాబు పేర్కొన్నారు. మరో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ అక్కడే (ముంబైలోనే) విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత త్వరలోనే తిరిగి వస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని సభకు వచ్చిన అభిమానులు, ప్రజలు ఆకాంక్షించారు.

Next Story