- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంజూరు అనంతగిరికి.. నిర్వహణ చిలుకూరులో..!
ప్రభుత్వం అనంతగిరి మండలానికి మంజూరు చేసిన బీసీ గురుకుల పాఠశాల ఇప్పటికీ మండల కేంద్రంలో కాకుండా చిలుకూరు మండలంలో కొనసాగుతోంది.

దిశ, అనంతగిరి : ప్రభుత్వం అనంతగిరి మండలానికి మంజూరు చేసిన బీసీ గురుకుల పాఠశాల ఇప్పటికీ మండల కేంద్రంలో కాకుండా చిలుకూరు మండలంలో కొనసాగుతోంది. దీంతో అనంతగిరి మండలానికి చెందిన విద్యార్థులు సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విద్యాభ్యాసం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మండలానికి మంజూరైన విద్యాసంస్థను అదే మండలంలో ఏర్పాటు చేయకపోవడం పై విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలలను ఏర్పాటు చేసినప్పటికీ, మండల కేంద్రంలో పాఠశాల లేకపోవడంతో స్థానిక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రవాణా సమస్యలతో పాటు అదనపు ఖర్చు, సమయ నష్టం కూడా భరించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలోని చాలా గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తరగతి గదులు, వసతి, ఆటస్థలాలు, తాగునీరు వంటి మౌలిక వసతుల కొరత విద్యార్థులను వేధిస్తోంది. ప్రభుత్వం అద్దె భవనాల పై ఖర్చు చేసే నిధులతో శాశ్వత భవనాలు నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అనంతగిరి మండలానికి మంజూరైన బీసీ గురుకుల పాఠశాలను మండల కేంద్రానికి తరలించి, శాశ్వత భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు. ఇలా చేస్తే మండలంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య మరింత చేరువ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.






