కర్ణాటక ఆలయాల్లో హుండీలకు కట్టుదిట్టమైన భద్రత.. విరాళాల లెక్కింపునకు కొత్త మార్గదర్శకాలు

by Ramesh Naini |

ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి తదితర విలువైన కానుకల భద్రతతో పాటు విరాళాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) అమలు చేయనుంది.

కర్ణాటక ఆలయాల్లో హుండీలకు కట్టుదిట్టమైన భద్రత.. విరాళాల లెక్కింపునకు కొత్త మార్గదర్శకాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి తదితర విలువైన కానుకల భద్రతతో పాటు విరాళాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) అమలు చేయనుంది. దేశంలోని పలు ఆలయాల్లో హుండీ విరాళాల దుర్వినియోగం, చోరీలు జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి..

ఎస్‌ఓపీ ప్రకారం హుండీల వద్ద నాలుగు వైపులా సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేయడంతో పాటు వాటి ప్రత్యక్ష ప్రసారాలను జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ముజ్రాయి శాఖ ప్రధాన కార్యాలయంతో అనుసంధానించనున్నారు. నగదు వినియోగాన్ని తగ్గించేందుకు యూపీఐ, భీమ్, క్యూఆర్ కోడ్‌ల ద్వారా డిజిటల్ విరాళాలను ప్రోత్సహించి, వాటిని ఆలయ అకౌంటింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు.

తహసీల్దార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపులు

హుండీల లెక్కింపు సమయంలో తహసీల్దార్ పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి. హుండీ తెరవడం నుంచి నగదును బ్యాంకులో జమ చేసే వరకు మొత్తం ప్రక్రియను తేదీ, సమయంతో వీడియో రికార్డు చేయాలి. లెక్కింపులో హోంగార్డులు, బ్యాంకు సిబ్బంది లేదా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పాల్గొనగా, సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. హుండీల్లో చోరీలు లేదా అక్రమాలు జరిగితే సంబంధిత ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులపై బాధ్యత నిర్ణయిస్తారు. భద్రతా ఏర్పాట్ల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి నెలా సమీక్ష నిర్వహించనున్నారు.

Next Story