ఈఎస్‌ఐ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ అభ్యర్థుల నిరసన

by Ratna Kumari |

స్టాఫ్ నర్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు, పోస్టింగ్‌లు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలోని ఈఎస్‌ఐ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

ఈఎస్‌ఐ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ అభ్యర్థుల నిరసన
X

దిశ‌, నాచారం : స్టాఫ్ నర్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు, పోస్టింగ్‌లు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలోని ఈఎస్‌ఐ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఈఎస్‌ఐ గేటు నుంచి డైరెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని నినాదాలు చేశారు. తమకు పోస్టింగ్‌లు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా నియామక ఉత్తర్వులు జారీ కాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డీఎంఈ, వైద్య విధాన పరిషత్ పరిధిలో నియామకాలు పూర్తయినా, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో ఎంపికైన 252 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు వదిలి రెండు నెలలుగా నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆందోళన నేపథ్యంలో ఇన్‌చార్జి డైరెక్టర్, ఐఏఎస్ అధికారి హరి చందనతో ఆర్.కృష్ణయ్య ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ క్రాంతికుమార్ ఆందోళన స్థలానికి చేరుకుని అభ్యర్థులతో చర్చలు జరిపారు. వారంలోపు, శనివారం నాటికి పోస్టింగ్‌లు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళనను విరమించారు. అయితే హామీ అమలు కాకపోతే వచ్చే సోమవారం డైరెక్టరేట్ కార్యాలయానికి తాళం వేసి విధులు నిలిపివేసేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రాందేవ్ యాదవ్‌తో పాటు సుమారు 200 మంది ఉద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

చంటి బిడ్డలతో మహిళల నిరసన..

ఆందోళనలో మహిళా ఉద్యోగ అభ్యర్థులు తమ చంటి బిడ్డలతో పాల్గొనడం అందరినీ కదిలించింది. ఒకవైపు చిన్నారులకు పాలిస్తూ, లాలిస్తూ మరోవైపు నిరసనలో పాల్గొన్నారు. పోస్టింగ్‌లు ఆలస్యం కావడంతో రెండు నెలల సీనియారిటీతో పాటు వేతనాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంలో కూడా అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు.

Next Story