- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి అధికారుల సమస్యలపై త్వరలో సానుకూల నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల తరహాలో అధికారుల వేతన సవరణ, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (పీఆర్పీ) అమలుకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సింగరేణి అధికార సంఘం నాయకులు ఇటీవల భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను వివరించడంతో, సోమవారం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రుతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి రాష్ట్ర అభివృద్ధికి కీలక సంస్థ అని పేర్కొన్న భట్టి విక్రమార్క, అధికారులు, కార్మికులు సంస్థ పురోగతికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.
బహుముఖ రంగాల్లో విస్తరించి...
అధికారుల్లో అసంతృప్తి నెలకొనకుండా వారి సమస్యలను సంఘం నాయకులతో చర్చించి పరిష్కరించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. రానున్న రెండు నుంచి మూడు నెలల్లో అధికారుల ప్రధాన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో సింగరేణి పోటీతత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, సంస్థను బహుముఖ రంగాల్లో విస్తరించి అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజు సాధనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు సింగరేణి అధికార సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. అధికారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపుతున్న సానుకూల వైఖరిని స్వాగతిస్తూ, సంస్థ అభివృద్ధికి తమ పూర్తి సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు.






