కోట్‌పల్లి కెనాల్ పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

by Kodari Anjali |

మండల పరిధిలో సాగుతున్న కోట్ పల్లి కెనాల్ కాలువ పునర్నిర్మాణ పనులలో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

కోట్‌పల్లి కెనాల్ పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
X

దిశ, పెద్దేముల్: మండల పరిధిలో సాగుతున్న కోట్ పల్లి కెనాల్ కాలువ పునర్నిర్మాణ పనులలో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామ పరిధిలో జరుగుతున్న కెనాల్ నిర్మాణ పనులలో నాణ్యత లోపించిందని సోమవారం జనగాం గ్రామ సర్పంచ్ అరుణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ.. జనగాం గ్రామ పరిధిలో నిర్మిస్తున్న కోట్ పల్లి కెనాల్ కాల్వ పనుల్లో కాంక్రీట్ మిశ్రమానికి ఇసుకకు బదులుగా డస్ట్ (క్రిస్టల్ పౌడర్) విచ్చలవిడిగా వాడుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. దీనివల్ల పనుల్లో నాణ్యత లోపించి, రానున్న రోజుల్లో కాల్వ పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు లాభాల కోసం డస్ట్ వాడుతూ రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. డస్టుకు బదులుగా ఇసుకను మాత్రమే ఉపయోగించి, భావితరాలకు ఉపయోగపడేలా నాణ్యమైన కాల్వను నిర్మించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే తక్షణ స్పందన...

సర్పంచ్ ఫిర్యాదుపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తక్షణమే స్పందించారు. సదరు కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, కెనాల్ నిర్మాణ పనులలో ఎలాంటి అలసత్వం వహించకూడదని హెచ్చరించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, డస్ట్ వాడకం ఆపేసి ఇసుకను మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండల అభివృద్ధి, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమస్యపై తక్షణమే స్పందించి కాంట్రాక్టర్‌ను ఆదేశించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవపై మండల ప్రజాప్రతినిధులు, పలువురు సర్పంచులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story