- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crude Oil: చమురు సంక్షోభానికి భారత్ కొత్త వ్యూహం
గత మూడు నెలల్లో భారత్ తన చమురు కొనుగోలు వ్యూహాన్ని పూర్తిగా మార్చి, ఒక్క ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి ముడి చమురును సేకరించే విధానాన్ని వేగంగా అమలు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేయడం, వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు మరోసారి ఆందోళనలో పడ్డాయి. ప్రపంచంలో సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ ద్వారానే సాగుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఈసారి భారత్ పరిస్థితి గతంతో పోలిస్తే భిన్నంగా ఉంది. గత మూడు నెలల్లో భారత్ తన చమురు కొనుగోలు వ్యూహాన్ని పూర్తిగా మార్చి, ఒక్క ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి ముడి చమురును సేకరించే విధానాన్ని వేగంగా అమలు చేసింది. దీంతో ప్రస్తుతం సరఫరా అంతరాయాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు గణనీయంగా పెరిగిందని ఇంధన రంగ నిపుణులు భావిస్తున్నారు.
మధ్యప్రాచ్య సాంప్రదాయ ఒప్పందాలకు స్వస్తి
ఈ ఏడాది ప్రారంభంలో గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలు భారత ఇంధన భద్రతలోని బలహీనతలను బయటపెట్టాయి. దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్, ఇప్పటివరకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాక్ వంటి మధ్యప్రాచ్య దేశాలతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారానే సరఫరా అందుకుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ రిఫైనరీలు రష్యా, అమెరికా, పశ్చిమాఫ్రికా, గయానా, బ్రెజిల్, వెనిజులా వంటి కొత్త సరఫరాదారుల వైపు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో ఒకే ప్రాంతం లేదా ఒకే దేశంపై ఆధారపడకుండా, అవసరాన్ని బట్టి ఎక్కడ చమురు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేసే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ మార్పు భవిష్యత్తులో భౌగోళిక రాజకీయ సంక్షోభాల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా సాగుతోంది.
దీర్ఘకాలిక ఒప్పందాల నుంచి స్పాట్ కొనుగోళ్ల వైపు
భారత్ వ్యూహంలో మరో కీలక మార్పు దీర్ఘకాలిక ఒప్పందాల నుంచి స్పాట్ మార్కెట్ కొనుగోళ్ల వైపు మారడం. గతంలో రిఫైనరీలు సంవత్సరాల పాటు కొనసాగే ఒప్పందాలపై ఆధారపడితే, ఇప్పుడు అవసరాన్ని బట్టి తక్షణ డెలివరీకి అందుబాటులో ఉన్న చమురును స్పాట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాయి. అలాగే నేరుగా చమురు ఉత్పత్తి దేశాలపై ఆధారపడకుండా, విటోల్, ట్రఫిగురా వంటి అంతర్జాతీయ కమోడిటీ ట్రేడింగ్ సంస్థల ద్వారా సరఫరాలను విస్తరిస్తున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో సంక్షోభం వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు అందే అవకాశం పెరుగుతోంది. ఇదే కారణంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు తమ కొనుగోలు విధానాన్ని వేగంగా మార్చుకుంటున్నాయి.
రష్యా మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు
అయితే రష్యా చమురు మాత్రమే భారత్‌కు శాశ్వత పరిష్కారం కాదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యా చమురు మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. అక్కడి రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు, ఎగుమతి టెర్మినళ్లపై దాడులు జరగడం వల్ల భవిష్యత్తులో సరఫరా అంతరాయాల ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే భారత్ ఇప్పుడు 'ఒకే సరఫరాదారు కాకుండా.. ఎక్కువ సరఫరాదారులు ఉండటమే అసలైన భద్రత' అనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీనికి అనుగుణంగానే విదేశాంగ, వాణిజ్య, ఇంధన శాఖలు కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ మార్కెట్లను అభివృద్ధి చేయడం వంటి చర్యలను వేగవంతం చేస్తున్నాయి. హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే భారత్ ఇప్పుడు మరింత బలమైన ఇంధన భద్రతా వ్యవస్థతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే స్థితిలో ఉంది.






