- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినోపై ప్రభుత్వం అలర్ట్.. ముందస్తు చర్యలు ఏర్పాటు
రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు....

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్రిశాట్‌లో అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాతం పరిస్థితులను వ్యవసాయ శాఖ రోజువారీగా సమీక్షించాలని, ప్రస్తుత నివేదిక ప్రకారం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉందన్నారు. వర్షాభావ జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా సూచించారు.
శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి యాజమాన్య చర్యను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, జిల్లాల్లో అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. శాస్త్రీయ విధానాలతో ఎల్-నినోను ఎదుర్కోవాలని, దీనికి సంబంధించి రాష్ట్రంలో డిఎస్ఆర్విధానం అమలు చేయాలని సూచించారు. ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి వారం విడుదల చేసే ఈ బులెటిన్‌లో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రాబోయే వారానికి, నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనా వేయాలన్నారు. డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశాలు, గరిష్ఠ–కనిష్ఠ ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు చేపడుతామన్నారు.
నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో ఈ నెల, వచ్చే నెలకు సంబంధించిన వాతావరణ అంచనాలను విశ్లేషించి, ఆయా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉండే నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, సాగునీటి లభ్యతపై ఖచ్చితమైన అంచనాలను కూడా బులెటిన్‌లో పొందుపరచాలని స్పష్టం చేశారు. ఈ వారపు బులెటిన్‌ను రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు సోషల్ మీడియా వేదికలు, స్థానిక మీడియా ద్వారా విస్తృతంగా రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సమాచారం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ వివరిస్తూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వర్షాలు ఆలస్యమైతే 16.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, జూలై 30 వరకు ఆలస్యమైతే 13.82 లక్షల క్వింటాళ్లు, ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే 12.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసి ముందుగానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
వరి రైతులు శాస్త్రవేత్తలు సూచనలు పాటించాలి :
వరి పంట నారుమడి దశలో ఉన్న రైతులు నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3సీజీ గ్రాన్యూల్స్ వేయాలని, నాటే సమయంలో నారు ఆకుల చివరలను కత్తిరించి నాటాలని, 15×10 సెంటీమీటర్ల దూరంతో దగ్గరగా నాటి ప్రతి గుంతలో 6–8 మొక్కలు ఉంచాలన్నారు. సిఫార్సు చేసిన మోతాదుతో పోలిస్తే 25 శాతం అదనపు నత్రజని ఇవ్వాలని, మొత్తం నత్రజనిలో 70 శాతం నాటే సమయంలో, మిగిలిన 30 శాతం పూత ప్రారంభ దశలో వేయాలని పేర్కొన్నారు. ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ విధానం అనుసరించాలని సూచించారు. కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. మొక్కజొన్న, పత్తి పంటలు ప్రస్తుతం మొలక దశలో ఉన్నందున రాబోయే రెండు వారాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే నేల తేమను కాపాడేందుకు కలుపు నియంత్రణ చర్యలు రైతులకు సూచించారు.
రాష్ట్రంలో అవసరమైన విత్తనాలు, ఎరువులపై ఇప్పటికే సమగ్ర అంచనా పూర్తి చేశామని, మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే సమీకరించామని, మార్క్‌ఫెడ్, విత్తన సంస్థలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతు నేస్తంలో ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు.






