- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమకారుల డిమాండ్లు సీఎం దృష్టికి.. వేగంగా జీవో కోసం కమిటీ బాధ్యత
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో భాగంగా సోమవారం అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం)లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో భాగంగా సోమవారం అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం)లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కె. కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎమ్. కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యమకారుల సలహాలను, సూచనలను కమిటీ స్వీకరించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ మూడు జిల్లాల ఉద్యమకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జరిగిన చారిత్రాత్మక ఆందోళనలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి ఇక్కడి క్షేత్రస్థాయి శ్రేణులే వెన్నుముకగా నిలిచారని కమిటీ స్పష్టం చేసింది.
ప్రతిపాదించిన చారిత్రాత్మక విధివిధానాలు
భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు శాశ్వత రక్షణ ఉండేలా, ఈ కమిషన్‌ను ఒక చట్టబద్ధమైన సంస్థగా మారుస్తూ చట్టం తీసుకురావాలి. నాటి రాష్ట్ర సాధన పోరాటంలో సర్వస్వము కోల్పోయిన ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థల అడ్మిషన్లలో, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించాలి. రాష్ట్ర సాధనలో పురుషులతో సమానంగా లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన మహిళా పోరాట యోధులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతతో పాటు ప్రత్యేక సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో జీవితకాల ఉచిత ప్రయాణ రవాణా పాస్ సౌకర్యం కల్పించాలి. గుర్తింపు పొందిన ఉద్యమకారుల పిల్లలకు లేదా వారి తదుపరి తరానికి కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచిత, నాణ్యమైన విద్యను ప్రభుత్వమే అందించాలి. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి నివాస అవసరాల నిమిత్తం ఉచితంగా 250 గజాల భూమిని కేటాయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి. వృద్ధాప్య దశలో ఉన్న ఉద్యమకారులు ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీలుగా గౌరవప్రదమైన జీవితకాల నెలవారీ పెన్షన్ అందించాలి. అన్ని ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా అపరిమిత వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయాలి.
అనంతరం కమిటీ సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ సమావేశంలో ఉద్యమకారులు ప్రతిపాదించిన అంశాలను కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఐ అండ్ పీఆర్ ద్వారా జరుగుతున్న పూర్తి స్థాయి డిజిటల్ రికార్డింగ్ ఆధారంగా, ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా ఈ హక్కులను సాధించి తీరుతామని భరోసా ఇచ్చారు. ఈనెల 22 వరకు ఈ ముఖాముఖి షెడ్యూల్ నిరంతరాయంగా కొనసాగుతుందని, ఈ ప్రధాన అంశాలతో కూడిన సమగ్రమైన, చారిత్రాత్మక నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించి త్వరితగతిన జీవో జారీ అయ్యేలా కమిటీ బాధ్యత తీసుకుంటుందని కమిటీ స్పష్టం చేసింది.






