ఇంటింటి ఫీవర్ సర్వేను ముమ్మరం చేయాలి: కలెక్టర్

by Kodari Anjali |

మందుల కొరత లేకుండా చూడాలని, సమయపాలన తప్పనిసరని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా అన్నారు.

ఇంటింటి ఫీవర్ సర్వేను ముమ్మరం చేయాలి: కలెక్టర్
X

దిశ, చంపాపేట్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి ఫీవర్ సర్వేను ముమ్మరంగా నిర్వహించాలని, బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం బహదూర్‌పుర మండలం కిషన్‌బాగ్‌లోని బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య సేవలు, రోగుల నమోదు రికార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్ పరీక్షలు, ఇంటింటి ఫీవర్ సర్వే పురోగతి, క్లస్టర్ పరిధిలో అమలు చేస్తున్న వైద్య కార్యక్రమాలు, సిబ్బంది హాజరు, ఆన్‌లైన్ నమోదు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి..

సంబంధిత వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని బస్తీ దవాఖానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మందుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇంటింటి ఫీవర్ సర్వే ద్వారా జ్వర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి వెంటనే చికిత్స అందించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్య సేవలతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో డాక్టర్ మొహమ్మద్ తౌఫిక్‌తో పాటు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story