కిమ్స్ వైద్యుల మరో అరుదైన విజయం.. ఎక్మోతో యువ డాక్టర్‌కు కొత్త జీవితం

by Kodari Anjali |

మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన 32 ఏళ్ల యువ వైద్యురాలి ప్రాణాలను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఎక్మో చికిత్సతో కాపాడారు.

కిమ్స్ వైద్యుల మరో అరుదైన విజయం.. ఎక్మోతో యువ డాక్టర్‌కు కొత్త జీవితం
X

దిశ, సికింద్రాబాద్: మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన 32 ఏళ్ల యువ వైద్యురాలి ప్రాణాలను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఎక్మో చికిత్సతో కాపాడారు. తీవ్రమైన ఇన్‌ఫ్లుయెంజా కారణంగా ఆమె శ్వాసకోశం తీవ్రంగా దెబ్బతిని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ బారిన పడగా, సాధారణ వెంటిలేటర్ చికిత్సకు స్పందించకపోవడంతో ఎక్మో సాయంతో చికిత్స అందించారు. కిమ్స్ హాస్పిటల్స్ లీడ్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డా. విశాల్ కుమార్ చిటికేశి తెలిపిన వివరాల ప్రకారం, రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో డా. వంశీ కృష్ణ నేతృత్వంలోని ఎక్మో బృందం ప్రత్యేకంగా షోలాపూర్‌కు వెళ్లి అక్కడే ఎక్మో చికిత్స ప్రారంభించింది. అనంతరం పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య అర్ధరాత్రి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారం రోజులపాటు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించగా, పల్మోనాలజీ, క్రిటికల్ కేర్, ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్, రెస్పిరేటరీ థెరపీ, నర్సింగ్, ఫిజియోథెరపీ విభాగాల వైద్యులు సమన్వయంతో వైద్యం అందించారు. మొత్తం 25 రోజులపాటు కొనసాగిన చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతూ వెంటిలేటర్ చికిత్సకు స్పందించని రోగులకు ఎక్మో ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తుందని డా. విశాల్ తెలిపారు.

Next Story