ఐటీ.. నో రిటర్న్స్... పన్ను ఎగవేతకు పక్కా ప్లాన్స్..

by Sujitha Rachapalli |

మనకో అలవాటుంటుంది. వచ్చేది ఎంతయినా తీసుకుంటాం. కానీ పది పైసలు బయటకు పోయేదుంటే మాత్రం మనసు ఒప్పుకోదు. ఏదో ఒకటి చేసి దాని నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాం.

ఐటీ.. నో రిటర్న్స్... పన్ను ఎగవేతకు పక్కా ప్లాన్స్..
X

దిశ, ఫీచర్స్: మనకో అలవాటుంటుంది. వచ్చేది ఎంతయినా తీసుకుంటాం. కానీ పది పైసలు బయటకు పోయేదుంటే మాత్రం మనసు ఒప్పుకోదు. ఏదో ఒకటి చేసి దాని నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాం. కొన్నిసార్లు దాని కంటే ఎక్కువైనా సరే వెనకాడం. ఈ పన్ను ఎగవేత అనేది కూడా దాని కిందికే వస్తుంది. లక్షల్లో సంపాదిస్తాం. లక్షణంగా ఉంటాం. ఆదాయానికి తగిన పన్ను చెల్లించమంటే మాత్రం తెగ బాధపడుతుంటాం.

ఐటీ అంటే భయమెందుకు?

లక్షల్లో జీతం. ఇంట్లో ఇద్దరికీ ఉద్యోగాలు. అదీగాక బయట చిట్టీలు.. రియల్ ఎస్టేట్ ద్వారా బాగానే సంపాదిస్తుంటారు. ఐనా.. ఎప్పుడు చూసినా ఏదో కోల్పయినట్లు ఫీలవుతుంటారు. తమ సొమ్మును దొంగలెవరో దోచినట్లు చింతచేస్తూ కనిపిస్తుంటారు. ‘ఏందన్నా లక్షల్లో సంపాదిస్తవ్.. ఎప్పుడు చూసినా ఏదో చింత చేస్తూ కనిపిస్తవ్’ అని అడిగితే.. ‘ఏమొస్తుందీ.. ఐటీయే సగం కట్ అవుతుంది. మన చేతికి ఎంతొస్తయ్’ అని అంటుంటారు. ఎక్కడైనా లక్ష రూపాయలు జీతం వస్తే యాభై వేలు కట్ అవుతాయా? ఒకవేళ అయితే ఎంతవుతుంది? ఆరు లేదా ఏడువేలు అంతే కదా?

ఎగవేస్తే ఏమవుతుందో తెలుసా?

సంపాదించినోడు టాక్స్ కట్టడానికి అంత ఆపసోపాలు పడితే ఇక సాధారణ ప్రజలు కట్టే పన్నుల గురించి ఏం మాట్లాడతాం? లక్ష రూపాయల్లో ఐదారు వేలు ఐటీ కట్ అయితేనే అంత బాధపడితే సర్కారు నుంచి మనం పొందే లబ్ధికి సంబంధించిన సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి కదా? కానీ మనోళ్లు అవేవీ ఆలోచించరు. ఈ ఐటీ టాక్స్.. మిగతా టాక్స్‌లు అంటే అవేవో మనకు సంబంధించిన విషయం కాదన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఇలా ఆలోచించడం వల్ల దేశ ఖజానాకు నష్టం చేకూరుస్తారు. తెలిసీ తెలియక పన్ను ఎగవేత ద్వారా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తారు.

భారమా? బాధ్యతా?

దేశ అభివృద్ధి ప్రభుత్వం ప్రధానంగా ఆధారపడేది పన్నులపైనే కదా? రోడ్లు.. స్కూళ్లు.. ఆసుపత్రులు.. సంక్షేమ పథకాలు.. రక్షణ వ్యవస్థ.. ఇలా ప్రతి రంగానికి నిధులు పన్నుల నుంచే వస్తాయి. ఇవన్నీ మనకు తెలియక కాదు. మన సంపాదనలో నుంచి సర్కారుకెందుకు టాక్స్ చెల్లించాలన్నదే వారి ఉద్దేశం. ఇక్కడ వాళ్ల సంపాదన కూడా పబ్లిక్ ద్వారానే అనే విషయం మర్చిపోతున్నారు. అందుకే చాలా మంది పన్ను చెల్లించడాన్ని బాధ్యతగా కాకుండా భారంగా భావిస్తారు. ఆదాయం పెరిగితే పన్ను కూడా పెరుగుతుందని భావించి.. దాన్ని తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతుంటారు.

లెక్కల్లో అబద్ధాలా?

పొద్దున లేస్తే నిజాయితీ గురించి మాట్లాడేవారే కొన్నిసార్లు ఆదాయపు పన్ను విషయానికి వచ్చేసరికి వేరేలా ఆలోచిస్తారు. తమ అసలు రూపం చూపిస్తారు. తమకొచ్చే నెల సంపాదన లేదా సంవత్సరానికి వచ్చే ఆదాయాన్ని తక్కువగా చూపించాలనుకుంటారు. ఈ మధ్య ఇలా తప్పుడు ఆదాయం చూపించడం చాలా సర్వ సాధారణం అయిపోయింది. చేతికి ఎంతొస్తే అంతే లెక్కల్లో చూపిస్తాం కదా? కానీ వీళ్లు అలా చూపించరు. చేతికి వచ్చే ఆదాయం ఒకటైతే.. కాగితాలపై చూపించే లెక్కల్లోని ఆదాయం మరొకటి ఉంటుంది. ఈ ధోరణియే పన్ను ఎగవేతకు మొదటి మెట్టు అవుతుంది.

మీకు లాభం చేస్తే చాలా?

పన్ను ఎగవేత ఒక సామాజిక వ్యాధిగా మారింది. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని దాచి పన్ను బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇది వాళ్లకు లాభం చేకూర్చేదే. కానీ దేశ ఆర్థిక వ్యవస్థను అదే తవ్రంగా దెబ్బతీస్తుంది. పన్ను ఎగవేత అనేది చట్టవిరుద్ధమైన చర్య. తన నిజమైన ఆదాయాన్ని ఐటీ శాఖకు చెప్పకపోవడం.. ఖర్చులను అధికంగా చూపడం.. ఆస్తులను దాచడం ద్వారా ట్యాక్స్ అవాయిడెన్స్‌కు పాల్పడుతుంటారు. పన్ను ఎగవేత వల్ల వందల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి జీవనాన్ని కష్టతరం చేస్తుంది.

ఏంటీ క్యాష్ కల్చర్?

మనం ప్రతీ రోజు చూస్తూనే ఉంటాం. చిన్నా, పెద్దా అనేక వ్యాపారాల్లో ఇప్పటికీ నగదు లావాదేవీలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. కొందరైతే ముందుగానే చెప్తారు క్యాష్ మాత్రమే తీసుకుంటాం అని. వాళ్ల ఉద్దేశం ఏంటంటే డిజిటల్ చెల్లింపులు చేస్తే ప్రతి ట్రాన్జాక్షన్ రికార్డులో ఉంటుంది. నగదు రూపంలో తీసుకుంటే అధికారులకు కనిపించకుండా ఉంటుంది. అంటే ఆ ఆదాయం లెక్కలోకి రాదుగా? ఫలితంగా అసలు ఆదాయాన్ని దాచిపెట్టి తక్కువ లాభాలు చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ ఇచ్చేదున్నా క్యాష్‌లో ఇచ్చి మిగిలినది బ్యాంక్ ద్వారా చూపించి పన్ను నుంచి తప్పించుకుంటారు.

కాగితాలపై కథలు ఎందుకు?

సంస్థలు లాభాల్లో నడుస్తున్నప్పటికీ ఖాతాల పుస్తకాలలో మాత్రం భారీ నష్టాలు చూపిస్తారు కొందరు. అవసరం లేని ఖర్చులు సృష్టించడం.. నకిలీ బిల్లులు తయారు చేయడం వంటి పద్ధతులు ఉపయోగిస్తుంటాయి. లాభం తగ్గితే పన్ను కూడా తగ్గుతుంది కదా అనే లాజిక్ వాడతారన్నమాట. ఇంకా కొందరు ఒక ప్లాన్ ప్రకారం లోన్లు తీసుకుంటారు. ఆ లోన్ తీసిన సొమ్ముతో ఆస్తి కొంటారు. బ్లాక్ మనీని వైట్ చేస్తారు. బినామీ పేర్లతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా కాగితాలపై కథలు సృష్టించి పన్ను అధికారులను మోసం చేస్తారు. ఇలా నోట్ల కోసం కక్కుర్తి పడి.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంటారు.

కృత్రిమ లావాదేవీల కక్కుర్తా?

ఇంకా విచిత్రం ఏంటంటే కొందరు మహా తెలివిమంతులు ‘షెల్ కంపెనీలు’ లేదా కాగితాలపై మాత్రమే ఉండే కంపెనీలు రిజిస్టర్ చేస్తున్నారు. అంటే వీళ్ల లావాదేవీలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారం ఏమీ జరగకపోయినా ఆ కంపెనీల పేర్లతో డబ్బు బదిలీలు జరిగినట్లు చూపిస్తారన్నమాట. పెట్టుబడులు వచ్చినట్లు.. ఖర్చులు చేసినట్లు.. అప్పులు ఇచ్చినట్లు కృత్రిమ లావాదేవీలు సృష్టిస్తారు. ఇక్కడ వాళ్ల లక్ష్యం ఒక్కటే. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాలి. అంతిమంగా పన్ను నుంచి తప్పించుకోవాలి. పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు చేసే పనులివే.

ఇది మోసం కాదా?

వ్యాపారులు కొందరు బోగస్ బిల్లులు, ఇన్‌వాయిస్‌లు తయారు చేసి ఖర్చులను అధికంగా చూపిస్తారు. ఇది లాభాలను తగ్గించి పన్నును తగ్గిస్తుంది. సినిమా నిర్మాణంలో ఖర్చులు ఎక్కువ చూపి లాభం తక్కువగా చూపడం తరచుగా జరుగుతుంటుంది కదా? ఐటీ రైడ్స్‌లో ఇలాంటి బోగస్ డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు బయటపడటం ఎన్నో చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి క్రమంగా చిన్న వ్యాపారుల నుంచి పెద్ద కంపెనీల వరకు వ్యాపించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి పన్ను ఎగవేత కథలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గించి ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తుంటారు.

నష్టం ప్రభుత్వానికా?

అధిక ఆదాయం, భారీ నగదు ప్రవాహం ఉండే రంగాల్లో పన్ను ఎగవేతకు అవకాశాలు ఎక్కువ. అందుకే వ్యాపారవేత్తలు.. సినీ ప్రముఖులు.. రాజకీయ నాయకుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు తరచూ కనిపిస్తుంటాయి. అలాంటి వాళ్లు పన్ను ఎగవేస్తే ప్రభుత్వానికే నష్టం అనుకుంటారు. కానీ అసలు నష్టపోయేది సమాజమే. పన్ను రూపంలో రావాల్సిన నిధులు తగ్గితే అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది కదా? అభివృద్ధి పనుల కోసం.. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుంది. చివరికి ఆ భారం మళ్లీ ప్రజలపైనే పడుతుందనేది గ్రహించాలి కదా?

కట్టేవాళ్లకు అన్యాయమా?

ఒక ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా పన్ను ఆటోమేటిక్‌గా కోతపడుతుంది. అతడికి దాచిపెట్టే అవకాశం ఉండదు. కానీ కొందరు పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించి కూడా పన్ను తప్పించుకుంటే నిజాయితీగా చెల్లించే పౌరులపై అదనపు భారం పడుతుంది. ఇది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుంది. అందుకే డిజిటల్ చెల్లింపులు, పాన్ ఆధార్ అనుసంధానం, జీఎస్టీ, బ్యాంకు లావాదేవీల పర్యవేక్షణ, ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ వంటి చర్యలతో పన్ను ఎగవేతను గుర్తించడం సులభమైంది. ఒక చోట ఇచ్చిన సమాచారం.. మరో చోట సమర్పించిన వివరాలతో సరిపోల్చి అక్రమాలను గుర్తించాలి.

మారాల్సింది చట్టాలా?

పన్ను ఎగవేత కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు. అది సామాజిక బాధ్యతను విస్మరించడం కూడా. ‘ఎలా తప్పించుకోవాలి?’ అనే ఆలోచన నుంచి ‘ఎలా బాధ్యతగా చెల్లించాలి?’ అనే దృక్పథం వైపు సమాజం మారినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. నిజాయితీతో చెల్లించిన పన్ను దేశ భవిష్యత్తులో పెట్టుబడిగా మారుతుంది. ఒక పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బలపడుతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే మార్పు చాలా అవసరం. మార్పుతో ఏదైనా సాధ్యమే. ఇక్కడ మార్పు అంటే మారాల్సింది చట్టాలు కాదు. మన మనస్తత్వం మారాలి.

పన్ను ఎగవేతపై ఐటీ శాఖ ఏఐ.. బిగ్ డేటా అనాలిసిస్ ద్వారా అనుమానాస్పద కేసులను గుర్తిస్తుంది. జీఎస్టీ.. ఇన్‌కమ్ ట్యాక్స్ డేటా సమీకరణ.. అంతర్జాతీయ సమాచార మార్పిడి (సీఎస్ఆర్) ద్వారా విదేశీ ఆస్తులను ట్రాక్ చేస్తుంది. 2025 ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌తో డిజిటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరింత బలపడింది. అయినా కొన్ని జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. పన్ను ఎగవేతతో డబ్బు ఆదా అయినట్లు అనిపించొచ్చు కానీ.. పట్టుబడినప్పుడు చాలా నష్టం జరుగుతుంది.

ఆదా కాదు.. నష్టం: చింతాకుల పరమేశ్వర్ గౌడ్, చార్టెడ్ అకౌంటెంట్

పన్ను ఎగవేతకు జరిమానాలు, శిక్షలు ఉన్నాయి. బ్లాక్ మనీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటారు. స్వచ్ఛందంగా డిక్లేర్ చేస్తే కొన్ని రాయితీలు ఉన్నాయి. కానీ కొనసాగిస్తే ఆస్తులు జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. పన్ను చెల్లించడం దేశ సేవ. అందరూ సరైన రిటర్న్స్ ఫైల్ చేయాలి. బోగస్ డాక్యుమెంట్లు వాడొద్దు. డిజిటల్ పేమెంట్లు, యూపీఐ వాడకం పెంచడం వల్ల ఎగవేత తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ నిజాయితీగా పన్ను చెల్లించి సమాజ నిర్మాణంలో భాగం కావాలి.

ఫైల్ చేయాల్సిందే: బొమ్మరిల్లు మహేశ్, అడ్వకేట్

Next Story