ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

by Ratna Kumari |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
X

దిశ, గంగాధర : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని విడుదల చేయబోమని ప్రకటించారని అన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు.

సాగునీరు కోరే రైతులు కన్నెపల్లి వద్ద బండ కట్టుకుని దూకాలంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని సుంకె రవిశంకర్ ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆత్మహత్యలకు ప్రేరేపించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత చట్టాల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గంగాధర పోలీసులను కోరినట్లు తెలిపారు.

తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే నీటిని నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం అవసరమైతే తమ రక్తాన్ని సైతం ఇవ్వడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని, అన్నదాతల ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story