​రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది

by Ratna Kumari |

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా యూరియా కొరత లేదని,రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ స్పష్టం చేశారు.

​రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది
X

దిశ,తాడ్వాయి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా యూరియా కొరత లేదని,రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ స్పష్టం చేశారు.నియోజకవర్గంలో యూరియా పంపిణీకి సంబంధించి ఎదురవుతున్న కొన్ని తాత్కాలిక ఇబ్బందులపై ఆయన తక్షణమే స్పందించారు.వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి,క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దారు.​ ​తాడ్వాయి మండలంలోని ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా యూరియా కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఆలస్యం వల్ల పంపిణీలో స్వల్ప అంతరాయం కలిగిందని ఎమ్మెల్యే తెలిపారు.విషయం తెలిసిన వెంటనే మండల,జిల్లా వ్యవసాయ అధికారులు, తన కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యూరియా లోడ్లను అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు. ​ప్రైవేట్ ఎరువుల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తే రవాణా,లేబర్ ఖర్చులు రైతులపై భారంగా మారుతాయనే ఉద్దేశంతో... రైతులకు ఒక్క రూపాయి కూడా అదనపు వ్యయం లేకుండా పిఏసిఎస్ పరిధిలోనే సమస్యను పరిష్కరించినట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా గోదాముల ద్వారా సరఫరాను మరింత సులభతరం చేస్తామన్నారు. ​దేశవ్యాప్తంగా యూరియా సరఫరాపై ఒత్తిడి ఉన్నప్పటికీ,ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే మదన్మోహన్ చెప్పారు.అధికారిక గణాంకాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోనే రైతులకు యూరియా సరఫరా చేయడంలో నియోజకవర్గ పరిధిలోని గాంధారి మండలం మొదటి స్థానంలో, సదాశివనగర్ మండలం నాల్గో స్థానంలో నిలవడం తమ నిబద్ధతకు నిదర్శనమని ఆయన గర్వంగా ప్రకటించారు.​యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్‌పై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ​ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం రైతులకు నేరుగా, పారదర్శకంగా ఎరువులు అందించడమే. రైతు పేరుతో బుకింగ్ అయితే ఆ రైతుకే యూరియా అందుతుంది.దీనివల్ల మధ్యవర్తుల జోక్యం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది,అని ఆయన స్పష్టం చేశారు. ​గతంలో ఫోన్ ఫే, గూగుల్ పే వంటి డిజిటల్ సేవలు ప్రారంభంలో కొత్తగా అనిపించినా,ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నట్లే.. ఈ యాప్ విధానానికి కూడా రైతులు త్వరలోనే అలవాటు పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. యాప్‌లో వచ్చే సాంకేతిక సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని తెలిపారు.

Next Story