- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరువు నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు.

దిశ, నల్లగొండ క్రైం : కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా వాటిని వినియోగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితుల్లోనూ నాగార్జునసాగర్ కింద రైతులకు సాగునీరు అందించామని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కూడా సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
2014కు ముందు ఉన్న దుర్భిక్ష పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని ఆరోపించారు. సాగర్ నుంచి 50 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్‌కు తరలించినా ప్రభుత్వం స్పందించలేదని, నల్లగొండతో పాటు హైదరాబాద్‌కు కూడా త్వరలో తాగునీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా సమీక్ష సమావేశాలు కేవలం ప్రదర్శనకే పరిమితమయ్యాయని, రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందడం లేదని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన జగదీశ్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. కన్నెపల్లి పంపులు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా నీటి సరఫరా సాధ్యమేనని ఆధారాలతో నిరూపిస్తానన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి అనర్హుడని ఆరోపిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే భారీగా గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలిశాయని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.






