కూటమి రాకతో చేనేతకు స్వర్ణయుగం ప్రారంభం

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ చర్యలతో చేనేత రంగానికి కొత్త కళ వచ్చింది. ఉచిత విద్యుత్, రూ.188 కోట్ల ఆప్కో అమ్మకాలతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి రాకతో చేనేతకు స్వర్ణయుగం ప్రారంభం
X

దిశ, ఏపీ బ్యూరో: కూటమి ప్రభుత్వం రాక నిస్తేజంలో కూరుకుపోయిన నేతన్నకు భరోసానిచ్చింది. గత రెండేళ్లలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న పరిశ్రమ అభివృద్ధి పథంలోకి పయనించసాగింది. నూతన టెక్స్ టైల్స్ పాలసీ, సంక్షేమ పథకాల పథకాల అమలు, డిజిటలైజేషన్, మార్కెటింగ్ ఒప్పందాల ద్వారా డీలా పడిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు నింపింది. చేనేత రంగాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేశ్ తీసుకున్న చొరవతో మంగళగిరి చేనేత కు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం దక్కింది.

సంక్షేమ పథకాలు.. ఉచిత విద్యుత్ అమలు

నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను రూ. 3 వేల నుంచి రూ. 4 కిలోలకు పెంచి, 92,724 మందికి లబ్ధి చేకూర్చింది. త్రిఫ్ట్ ఫండ్ కింద ప్రభుత్వ వాటాను 8 శాతం నుంచి ఏకంగా 16 శాతానికి పెంచింది. అలాగే ముద్ర రుణాల కింద రూ. 65.35 కోట్లు, నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ కోసం రూ. 175 కోట్లు కేటాయించింది. ఎన్నికల హామీని నిలబెట్టుకుని మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. దీనివల్ల దాదాపు 1.04 లక్షల కుటుంబాలకు ఏటా రూ. 150 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతోంది. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ రియింబర్స్‌మెంట్ ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీతో పాటు క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు.

ఆప్కో అమ్మకాల జోరు..

మారుతున్న కాలానికి అనుగుణంగా యువత, మహిళలను ఆకట్టుకునేలా కలంకారి, పెన్ కలంకారి, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, వెల్క్రో ధోవతులు, మోడీ జాకెట్లతో కూడిన రెడీమేడ్ చేనేత వస్త్రాల తయారీపై 5 జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. ఆప్కో ద్వారా 40 షోరూమ్‌లలో 6,770 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. సొంత వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యేక శిక్షణ, ఐదు కొత్త షోరూమ్‌ల ఏర్పాటుతో గడచిన రెండేళ్లలో ఆప్కో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 188.01 కోట్ల అమ్మకాలు జరిగాయి. చేనేత వస్త్రాల పై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తూ, నేటి తరానికి నేతన్నలను కూటమి ప్రభుత్వం మరింత దగ్గర చేస్తోంది.

మెగా క్టస్లర్లు, టైక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు

చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ. 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో నూతన టెక్స్‌టైల్స్ పాలసీని తెచ్చారు. ఇందులో భాగంగా ధర్మవరంలో రూ. 38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్, పిఠాపురంలో రూ. 15.11 కోట్లతో స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, విశాఖలో రూ. 172 కోట్లతో యూనిటీ మాల్, అమరావతిలో హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. టాటా తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలతో ఆప్కో మార్కెటింగ్ ఒప్పందాలు చేసుకుంది.

చేనేత వస్త్రాల విక్రయాలకు ఒప్పందాలు..

చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూనే, మరింత మార్కెటింగ్ సౌకర్యాలు పెంచే ప్రణాళికల్లో భాగంగా పలు ఒప్పందాలు చేసుకుంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్. ఏపీ హస్తకళల కార్పొరేషన్ తోనూ ఆప్కో ఒప్పందం చేసుకుంది. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో ఉపకరించనున్నాయి.

చేనేతకు లోకేశ్ దంపతుల ప్రమోషన్

ఏపీ చేనేతకు... ప్రత్యేకించి మంగళగిరి చేనేత వస్త్రాలకు మంత్రి నారా లోకేశ్ దంపతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. లోకేశ్, బ్రాహ్మాణిలు ఏ శుభకార్యానికి వెళ్లినా చేనేత వస్త్రాలనే బహుకరిస్తున్నారు. ఇక బ్రహ్మాణి వివిధ సందర్భాల్లో మంగళగిరి చేనేత వస్త్రాలు ధరిస్తూ ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు లోకేశ్ తాను కలిసే ప్రతినిధులకు... తనను కలవడానికి వచ్చే వారికి చేనేత శాలువాతో సత్కరిస్తున్నారు. ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ లోకేశ్ చేనేత వస్త్రాలతో ఆయన్ను సత్కరిస్తారు. తాజాగా ప్రజా ప్రతినిధుల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందులోనూ మంగళగిరి చీరలను బహుకరించారు. ఇక మంగళగిరిలో నేతన్నల కోసం వీవర్ శాల ఏర్పాటు చేశారు.

అవార్డుల వెల్లువ

రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు వస్తున్నాయి. వన్ డిస్ట్రిక్ - వన్ ప్రొడెక్ట్ కింద పలు చేనేత వస్త్రాల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరానికి గాను పది ఓడీ-ఓపీ అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది. వాటిలో ఏడు అవార్డులు చేనేత, జౌళి శాఖకు చెందినవే కావడం విశేషం. ఆప్కోలో చేపట్టిన డిజిటైలేజేషన్‌కు గానూ స్కోచ్ అవార్డు సొంతమైంది.

365 రోజులూ ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

గడచిన రెండేళ్ల కాలంలో చేనేత రంగానికి ఊపిరి పోసేలా కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే, నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్ధిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని మంత్రి వివరించారు. గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగుతోందని చెప్పారు. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత చెప్పారు.

Next Story