నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం: జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం: జిల్లా కలెక్టర్
X

దిశ, ప్రతినిధి నిర్మల్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటుకు సంబంధించి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చని తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంకు సహకారంతో జిల్లాలో ఆధునిక సదుపాయాలతో కూడిన ఆర్‌సెటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ శిక్షణ సంస్థ ద్వారా సంప్రదాయ కోర్సులతో పాటు తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు, మత్స్య సంపద అభివృద్ధి, పాడి పరిశ్రమ, కంప్యూటర్, ఇతర సాంకేతిక ఆధారిత కోర్సులు, చిన్న వ్యాపారాల నిర్వహణ, సేవారంగానికి సంబంధించిన నైపుణ్య శిక్షణలను అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ శిక్షణలు యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉట్నూర్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్‌సెటీ శిక్షణ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కోర్సులు, శిక్షణ విధానాలు, లబ్ధిదారుల ఎంపిక, ఉపాధి కల్పన అవకాశాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల విధానాలను అధ్యయనం చేసి నిర్మల్ జిల్లాలో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రతిపాదిత శిక్షణ సంస్థ కోసం అవసరమైన స్థలం, మౌలిక సదుపాయాలు, శిక్షణా కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ విధానాలపై సంబంధిత శాఖల అధికారులు పనిచేసి త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్, కార్మిక శాఖ అధికారి రాజలింగు, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story