SBI: ఆర్‌బీఐ సంస్కరణలతో రూ. 6.2 లక్షల కోట్ల విదేశీ నిధులు రావొచ్చు

by S Gopi |

ఈ నిర్ణయాలు కేవలం తాత్కాలిక ఊరటనివ్వడమే కాకుండా, రాబోయే రోజుల్లో దేశంలోకి భారీగా విదేశీ డాలర్లు వచ్చేలా చేస్తాయని ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్ తమ తాజా విశ్లేషణల్లో పేర్కొన్నాయి.

SBI: ఆర్‌బీఐ సంస్కరణలతో రూ. 6.2 లక్షల కోట్ల విదేశీ నిధులు రావొచ్చు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్‌బీఐ తాజా నిర్ణయాలు భారత మార్కెట్లో కొత్త జోష్ నింపాయి. ఈ నిర్ణయాలు కేవలం తాత్కాలిక ఊరటనివ్వడమే కాకుండా, రాబోయే రోజుల్లో దేశంలోకి భారీగా విదేశీ డాలర్లు వచ్చేలా చేస్తాయని ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్ తమ తాజా విశ్లేషణల్లో పేర్కొన్నాయి. ఆర్‌బీఐ చేపట్టిన ఈ సంస్కరణల ఫలితంగా మన దేశంలోకి ఏకంగా 40 నుంచి 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.3 లక్షల కోట్ల నుంచి రూ. 6.2 లక్షల కోట్ల) విదేశీ నిధులు పోటెత్తవచ్చని ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ పెట్టుబడుల రాకతో, ప్రస్తుతం ఒడిదొడుకులకు లోనవుతున్న మన రూపాయి విలువ భవిష్యత్తులో 92-93 స్థాయికి బలపడే అవకాశం ఉందని నిపుణులు నమ్ముతున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టే, ఆర్‌బీఐ ప్రకటన వెలువడిన ఒక్క రోజులోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 50 పైసలు బలపడటం మార్కెట్ ఉత్సాహానికి నిదర్శనం.

ఆర్‌బీఐ శుక్రవారం నాటి ప్రకటనలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పలు మార్పులు చేసింది. విదేశీ ఇన్వెస్టర్లు మన దేశంలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు 15, 30, 40 ఏళ్ల కాలపరిమితి గల కొత్త ప్రభుత్వ బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్రోత్సాహకాల కింద విదేశాల్లో ఉంటున్న భారతీయులు మన దేశ బ్యాంకుల్లో దాచుకునే 'ఎఫ్‌సీఎన్‌ఆర్' డిపాజిట్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. విదేశీ నిధులు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేలా పలు మార్కెట్ నిబంధనలను ఆర్‌బీఐ సులభతరం చేసింది. మొత్తంగా, ఆర్‌బీఐ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ టెన్షన్ల నుంచి రక్షించడమే కాకుండా, రూపాయిని మరింత స్థిరంగా ఉంచేలా చేస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story