బెహ్రెయిన్‌లో ఈద‌రాడ యువ‌తి మృతి.. స్వ‌దేశానికి మృత‌దేహం

by Vemula.Srinu Prasad |

బెహ్రెయిన్ దేశంలో మృతి చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈడరాడ గ్రామానికి చెందిన బ‌ళ్ల శైలు (23) మృతదేహాన్ని శనివారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు తెలిపారు....

బెహ్రెయిన్‌లో ఈద‌రాడ యువ‌తి మృతి.. స్వ‌దేశానికి మృత‌దేహం
X

దిశ‌, అమ‌లాపురం: బెహ్రెయిన్ దేశంలో మృతి చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈడరాడ గ్రామానికి చెందిన బ‌ళ్ల శైలు (23) మృతదేహాన్ని శనివారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు తెలిపారు. బళ్ల‌ శైలు ఉపాధి నిమిత్తం సుమారు ఆరు నెలల క్రితం బెహ్రెయిన్ దేశానికి వెళ్లి ఒక ఇంటిలో గృహ కార్మికురాలిగా పనిచేస్తోంద‌ని, ఈ నేపథ్యంలో ఆమె 2026 మే 25న మృతి చెందినట్లు సమాచారం అందిందని

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ ఆర్‌. మహేష్ కుమార్ ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను సంప్రదించగా, కేసీఎం బృందం వెంటనే స్పందించి బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించింది. అనంతరం భారత రాయబార కార్యాలయంకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించి, అవసరమైన చర్యలు చేపట్టింది. బెహ్రెయిన్‌లో మృతదేహాన్ని స్వదేశానికి తరలింపునకు అవసరమైన అన్ని అధికారిక ప్రక్రియలను అక్కడ ఉన్న బంధువుల సహకారంతో పూర్తి చేయించారు. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ, అలాగే భారత రాయబార కార్యాలయం, బెహ్రెయిన్ పరస్పర సమన్వయంతో పనిచేశాయని తెలిపారు.

అన్ని అధికారిక అనుమతులు మరియు ప్రక్రియలు పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కార్గో విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీఎన్ ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా ఈడరాడ గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సహాయ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, కేసీఎం నోడల్ అధికారి వి. సుబ్బారావు, కేసీఎం సమన్వయ అధికారి గోళ్ళ రమేష్, సిబ్బంది కడియాల సత్తిబాబు, ఎస్.ఎం. సఫియా, సోషల్ వర్కర్ మరియు లీగల్ అడ్వైజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story