నిమ్స్‌లో మరో అరుదైన శస్త్ర చికిత్స.. గాట్లు లేకుండానే సర్జరీ పూర్తి

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు న్యూరో సర్జరీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించారు.

నిమ్స్‌లో మరో అరుదైన శస్త్ర చికిత్స.. గాట్లు లేకుండానే సర్జరీ పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు న్యూరో సర్జరీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. అత్యంత అధునాతన, వినూత్న సాంకేతికతతో కూడిన ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్ (ఈటీఓఏ) పద్ధతి ద్వారా ఒక రోగికి ఎలాంటి కోతలు, గాట్లు లేకుండా కంటి సాకెట్ (కనుబొమ్మ కింద) గుండా మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే ఈ అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించి పేద రోగికి పునర్జన్మ ప్రసాదించారు. అరుదైన సర్జరీ చేసిన వైద్య బృందాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ, నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప అభినందించారు. ఏటా 3500 కంటే ఎక్కువ బ్రెయిన్, స్పైన్ సర్జరీలు చేస్తూ.. దేశంలోనే అత్యుత్తమ న్యూరో సర్జరీ కేంద్రాలలో ఒకటిగా ఉన్న నిమ్స్.. తాజా విజయంతో ప్రభుత్వ రంగంలోనూ ప్రపంచ స్థాయి చికిత్సలు సాధ్యమేనని మరోసారి నిరూపించింది.

ట్రాన్స్‌ఆర్బిటల్ విధానంలో కోతలు, గాట్లు లేని సర్జరీ

ఎం. లత (50) అనే మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడు లోపల, కంటి గుడ్డు వెనుక భాగంలో (స్కల్ బేస్) ఒక పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితులను తొలగించాలంటే క్రానియోటమీ (తల పుర్రెను పెద్ద మొత్తంలో కోయడం) పద్ధతిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే, ఇందులో ఉండే ప్రమాదాలను అధిగమించడానికి నిమ్స్ న్యూరో సర్జరీ బృందం సరికొత్త కనిష్ట కోత (మినిమల్లీ ఇన్వాసివ్) పద్ధతిని ఎంచుకుంది. సాంప్రదాయ పద్ధతుల్లా కాకుండా, ఈ సరికొత్త విధానంలో కనుబొమ్మ ముడత (ఐ బ్రో క్రీజ్) వెంబడి ఒక చిన్న కోత పెట్టి, కంటి సాకెట్ ద్వారా మెదడులోని కణితి వరకు చేరుకుంటారు. దీనివల్ల తలపై పెద్దగా కోయాల్సిన అవసరం ఉండదు. శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి గాటు, మచ్చా కనిపించదు. ఈ విధానం వల్ల పుర్రెను పెద్దగా తెరవాల్సిన అవసరం లేదు. హై-డెఫినిషన్ రిజిడ్ ఎండోస్కోప్‌ను ఉపయోగించి మెదడు లోపలి భాగాన్ని క్లియర్ గా వీక్షించారు. సర్జరీ సమయంలో మెదడులోని కీలక రక్తనాళాలు, నరాలకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు అధునాతన టెక్నాలజీతో మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో జీపీఎస్ లాంటి 3డీ న్యూరోనావిగేషన్ సాంకేతికతను వాడారు. అలాగే కణితిని చిన్న ముక్కలుగా చేసి సురక్షితంగా బయటకు తీసేందుకు కుసా (కావిట్రాన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్) అనే అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ పరికరాన్ని ఉపయోగించినట్లు నిమ్స్, న్యూరో సర్జరీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డా. ఎర్రగుంట తిరుమల్ తెలిపారు. ఈ సర్జరీలో కంటిపై గానీ, మొహంపై గానీ ఎలాంటి బాహ్య మచ్చలు పడవు. కనుబొమ్మ కోత సహజంగా కలిసిపోతుంది. మెదడు కణజాలానికి ఎలాంటి నష్టం వాటిల్లదు, పక్షవాతం లాంటి నరాల బలహీనత ముప్పు తప్పుతుంది. రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, శస్త్రచికిత్స తర్వాతి నొప్పులు చాలా తక్కువ. రోగి చాలా వేగంగా కోలుకుని, తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్ కావచ్చు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు.

Next Story