అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యం

by Batti.Sumithra |

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల (కె) గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు మూడ నాగవ్వకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. లబ్ధిదారురాలు, అధికారులతో కలిసి కలెక్టర్ గృహప్రవేశం చేశారు. అనంతరం ఇంటిని పరిశీలించి, ఇప్పటి వరకు అందిన డబ్బుల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతకుముందు గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇళ్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్పించిన వసతులను వాకబు చేశారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మాట్లాడుతూ గ్రామస్తుల వినతి మేరకు కేటాయింపు పూర్తయి మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు అందిస్తామని అన్నారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్‌ను పరిశీలించారు. రైతులంతా ఫామ్ పాండ్‌ల నిర్మాణాలకు ముందుకు రావాలని అన్నారు.

రైతు నేస్తం అందరికీ చేరాలి : కలెక్టర్

సోన్ మండల రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు 'రైతు నేస్తం' కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ సంతోష్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎంపీడీఓ సుధాకర్, సర్పంచ్ దుమాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story