- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై వినతిపత్రం సమర్పించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ఆమోదం పొందిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) మంజూరు చేయాలని, డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించి ప్రయాణికుల భద్రత మరింత మెరుగుపడుతుందని వివరించారు.
దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. ఇటీవల ఇందల్వాయి, జానకంపేట ప్రాంతాల్లో నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిల (ఆర్‌ఓబీలు) మంజూరుకు సహకరించినందుకు కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు.






