ఉద్యోగ మహిళల రక్షణే లక్ష్యం.. సమన్వయకర్త చైతన్య

by Batti.Sumithra |

పనిచేసే ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడమే పని ప్రదేశాల్లో మహిళల పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రధాన ఉద్దేశమని మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త చైతన్య అన్నారు.

ఉద్యోగ మహిళల రక్షణే లక్ష్యం.. సమన్వయకర్త చైతన్య
X

దిశ, కోదాడ : పనిచేసే ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడమే పని ప్రదేశాల్లో మహిళల పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రధాన ఉద్దేశమని మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త చైతన్య అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కోదాడ పట్టణంలోని మురళీకృష్ణ ధాబాలో మహిళలకు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ మహిళలు తాము పనిచేసే ప్రతి చోట భయం, ఒత్తిడి, వేధింపులు లేకుండా విధులు నిర్వహించే హక్కు కలిగి ఉన్నారని చెప్పారు.

లైంగిక వేధింపులకు గురైన మహిళలు మౌనంగా బాధపడకుండా, చట్టం కల్పించిన హక్కులను వినియోగించుకుని ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయం, సంస్థలో ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు. ఆ కమిటీ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల నమోదు వేదికలో నమోదు చేయాలని సూచించారు. బాధిత మహిళలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తమ శాఖను సంప్రదించాలని కోరారు. అలాగే మహిళల రక్షణ, సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయ దూరవాణి సంఖ్యల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం లింగ సమానత్వ నిపుణుడు వినోద్, మురళీకృష్ణ ధాబా యజమాని మురళీకృష్ణ, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Next Story