వర్షం కురిస్తే చాలు.. వీరన్న వాగు వద్ద ప్రయాణమంటేనే గుబులు

by Ratna Kumari |

వర్షాకాలం వచ్చిందంటే చాలు మర్పల్లి-మోమిన్‌పేట్ రహదారిపై ప్రయాణించే వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

వర్షం కురిస్తే చాలు.. వీరన్న వాగు వద్ద ప్రయాణమంటేనే గుబులు
X

దిశ, మర్పల్లి : వర్షాకాలం వచ్చిందంటే చాలు మర్పల్లి-మోమిన్‌పేట్ రహదారిపై ప్రయాణించే వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిరిపురం గ్రామ పరిధిలోని వీరన్న వాగు వద్ద పరిస్థితి ప్రతి ఏడాది ఆందోళనకరంగా మారుతోంది. కొద్దిపాటి వర్షానికే ఉగ్రరూపం దాల్చే వీరన్న వాగు కారణంగా మోమిన్‌పేట్-మర్పల్లి మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిపురం గ్రామ సమీపంలోని వీరన్న వాగుపై నిర్మించిన వంతెన ఎత్తు తక్కువగా ఉండటమే ప్రధాన సమస్యగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు వంతెనపై నుంచి ప్రవహించడంతో రహదారి పూర్తిగా జలమయమవుతోంది. దీంతో మోమిన్‌పేట్, మర్పల్లి ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోవడం నిత్యకృత్యంగా మారింది. అత్యవసర పనులపై వెళ్లే ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు గంటల తరబడి వంతెనకు ఇరువైపులా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. వరద నీరు ఉధృతంగా ప్రవహించే సమయంలో వంతెన ఎటువైపు ఉందో కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు వంతెనకు ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడలు (రైలింగ్స్) లేకపోవడం ప్రయాణికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు కాస్త అజాగ్రత్తగా ఉన్నా నేరుగా వాగులో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు వాహనదారులు తృటిలో ప్రమాదాల నుంచి బయటపడిన సంఘటనలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, వీరన్న వాగుపై తాత్కాలికంగా ప్రమాదాలు నివారించేందుకు వెంటనే రక్షణ గోడలు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story