- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : భారత ఆర్మీ మాజీ అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె రాసిన ఆత్మకథ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా సైనికాధికారుల ఆత్మకథలు వారి జీవిత ప్రయాణం, పడిన కష్టాలు, ఆర్మీలో అనుభవాలు, దేశసేవ గురించిన విషయాలు ప్రధానంగా ఉంటాయి. కానీ ఇంకా విడుదలే కాని ఈ పుస్తకం మాత్రం ఆర్మీపై రాజకీయ ఒత్తిళ్ల గురించి, సరిహద్దుల్లో జరుగుతున్న విషయాలపై చర్చించడం దుమారం రేపింది. ఇక ఈ పుస్తకంలోని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని లోక్‌సభలో నిలదీయడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాదు... కేంద్ర ప్రభుత్వ పాలన, దేశ భద్రత, నిజానిజాలు అన్న అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఎం.ఎం. నరవణె ఆటోబయోగ్రఫీలో ప్రధానంగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు.. మరీ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, లడఖ్, గాల్వాన్ ఘటన, కాశ్మీర్ పరిస్థితులు వంటి సున్నితమైన విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. సరిహద్దులో ఏదో జరుగుతోందని, నిజాలను కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
గాల్వాన్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం "చైనా ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదు. సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు" అని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇందుకు విరుద్ధంగా నరవణె తన పుస్తకంలో ''చైనా సైన్యం ముందుకు వచ్చింది, సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది" అనే ఉద్దేశంతో పలు వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ లోక్‌సభలో లేవనెత్తారు. "ప్రభుత్వం ఏదో నిజం దాస్తోంది. భారత్ భూమి కోల్పోలేదు అంటే మరి ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి?" అని నిలదీశారు. అయితే రాహుల్ లేవనెత్తిన అంశం కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనా? లేక నిజంగానే సరిహద్దుల్లో పరిస్థితి ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా ఉందా? అన్నది ప్రజల్లో చర్చగా మారింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం "ఇది ఒక అధికారి వ్యక్తిగత అభిప్రాయం" అని చేతులు దులుపుకుంటోంది. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. పైగా అత్యున్నత హోదాలో పనిచేసిన వ్యక్తి మాటలను తేలిగ్గా పక్కన పెట్టడం ప్రజల్లో మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది.
ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మరో మాట ఏమిటంటే... "దేశ భద్రత విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదు" అని. ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ప్రభుత్వం నిజాన్ని ప్రజలకు చెప్పకపోతే, ఆ నిజం గురించి ప్రశ్నించకూడదంటే, అప్పుడు ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. దేశ భద్రత పేరిట నిజాలను దాచడం, ప్రశ్నలు అడిగిన వారిని దేశద్రోహులుగా చూపించడం చాలా ప్రమాదకరమైన ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నరవణె దేశానికి దశాబ్దాల పాటు సేవ చేసిన వ్యక్తి. ఆయన మాటలు నిరర్థకమైనవి కావు. ఒకవేళ అవి తప్పైతే, ప్రభుత్వం ఆధారాలతో వాటిని ఖండించాలి. కానీ మౌనం పాటించడం వల్లే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈ పుస్తకం మరో కీలక అంశాన్ని కూడా బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అది సైన్యం - రాజకీయ నాయకత్వం మధ్య సమన్వయం. సరిహద్దుల విషయంలో సైన్యం ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పూర్తిగా పాటించిందా? లేక తమ పార్టీ రాజకీయ లాభనష్టాల కోసం కొన్ని విషయాలను పక్కన పెట్టిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు రాజకీయ ప్రచారానికి ఉపయోగపడే అంశాలు కావు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిదాన్నీ తన ఇమేజ్ కాపాడుకునే కోణంలో చూస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిజాలు చెప్పడం కంటే, పెద్ద పెద్ద దేశభక్తి నినాదాలను తెర మీదికి తెస్తున్నారనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.
కశ్మీర్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పూర్తిగా శాంతి నెలకొన్నట్టు మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవంగా సైన్యం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలు పూర్తిగా తగ్గాయా? పరిస్థితి పూర్తిగా సాధారణమైందా? నరవణె పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు పరోక్షంగా సమాధానాలు ఇస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇవి దేశానికి వ్యతిరేక వ్యాఖ్యలా? లేక ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పని నిజాలా? అన్నది ప్రజలు ఆలోచించాల్సిన విషయమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
ఇంత తీవ్రమైన చర్చ జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా మాట్లాడటం లేదు? పుస్తకం విడుదలైన వెంటనే స్పందించకపోవడం, తర్వాత పార్లమెంట్‌లో కూడా క్లారిటీ ఇవ్వకపోవడం సహజంగానే ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. నిజం నిజంగా ప్రభుత్వం వైపే ఉంటే, భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్షం ప్రశ్నలు అడిగితే దేశద్రోహమా? ప్రజలు ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అనే ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తున్నాయి.
దేశ సైనికుల ప్రాణాలు, దేశ భూభాగం, దేశ భవిష్యత్తు గురించి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలను “రాజకీయం” అంటూ కొట్టిపారేయలేం. ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. పార్లమెంట్‌లో ఈ అంశాలపై పూర్తి స్థాయి చర్చ జరగాలి. దేశ ప్రజలకు నిజం చెప్పాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం. నరవణె పుస్తకం దేశ పరిస్థితులపై అద్దంలాంటిది. ఆ అద్దంలో ప్రభుత్వం తన నిజమైన ప్రతిబింబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాన్ని ఎంతకాలం దాచినా, అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. అప్పుడు నష్టం ప్రభుత్వానికి మాత్రమే కాదు, దేశానికే అనే అభిప్రాయం ప్రజల్లో వినవస్తోంది.






