నిరుపేదల అసైన్డ్ భూముల పై 'పెద్దల' పంజా

by Batti.Sumithra |

అభాగ్యులకు అండగా ఉండాల్సిన అధికారులే రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ పేదల కడుపు కొడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుపేదల అసైన్డ్ భూముల పై పెద్దల పంజా
X

దిశ, దమ్మపేట : అభాగ్యులకు అండగా ఉండాల్సిన అధికారులే రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ పేదల కడుపు కొడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దమ్మపేట మండలం నల్లకుంట గ్రామంలోని సర్వే నంబర్ 273/1లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదల అసైన్డ్ భూములను బడాబాబులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు శనివారం నల్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పోలీస్ స్టేషన్‌కు భూమి ఇచ్చిన రైతు కుటుంబానికే ప్రత్యామ్నాయంగా కేటాయింపు..

నల్లకుంట సర్వే నంబర్ 273/1లో రైతులు 1975 నుంచి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని వారు తెలిపారు. బాధిత రైతుల్లో ఒకరు గతంలో దమ్మపేట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తమ సొంత భూమిని ప్రభుత్వానికి ఇవ్వగా, ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ భూమిని కేటాయించిందని చెప్పారు. అలాగే మిగతా నిరుపేద రైతులకు కూడా ప్రభుత్వం దశాబ్దాల క్రితమే ఈ భూములను అసైన్డ్ భూములుగా కేటాయించిందన్నారు. తాము కోటీశ్వరులు కాదని, రోజువారీ పూట గడవక రోడ్డు పక్కన పప్పు-సాంబార్ అమ్ముకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అభాగ్యులమని రైతులు వాపోయారు. తమకున్న ఏకైక జీవనాధారమైన ఈ భూమి కోల్పోతామనే ఆందోళనతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కొందరు రైతులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మరణించిన రైతుల కుటుంబాలపైనా వేధింపులు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఏపీ ఎమ్మెల్యే కోసం ఇక్కడ 'మువ్వా' పెత్తనం..

ఈ భూముల పై మాజీ ఐఏఎస్ అధికారి బి. దానం కుమారుడు, ప్రస్తుత ఏపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కన్నేశారని రైతులు ఆరోపించారు. దానం కుటుంబం సృష్టించిన పత్రాలు చెల్లవని 2010లో నాటి సబ్‌కలెక్టర్ పౌసమి బసు అప్పటి కలెక్టర్ ఉషారాణికి సమర్పించిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. అయినప్పటికీ, ఏపీ ఎమ్మెల్యే విజయ్ కోసం తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్ మువ్వా విజయ్ బాబు తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, తన తోడల్లుడు ఉడతనేని మధుసూదన్‌రావు ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వారు మండిపడ్డారు.

అడ్డుకున్నందుకే అక్రమ కేసులు..

హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 31912/2025లో రైతుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారని రైతులు వాపోయారు. మువ్వా విజయ్ బాబు తోడల్లుడు ఉడతనేని మధుసూదన్‌రావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా, అధికారులు ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇతరులు తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని రైతులు న్యాయవాది ద్వారా సంబంధిత అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించారని తెలిపారు. దీనిపై కక్షగట్టిన పోలీసులు, రెవెన్యూ అధికారులు జూలై 2న సాగులో ఉన్న తమపైనే హడావుడిగా క్రిమినల్ కేసులు నమోదు చేశారని, ఇది అధికారుల పక్షపాత ధోరణికి నిదర్శనమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రులు పొంగులేటి, తుమ్మల మమ్మల్ని కాపాడాలి..

"మా ప్రాణాలు పోయినా ఈ మట్టిని వదిలిపెట్టం. ఈ భూ మాఫియా నుంచి మమ్మల్ని, మా భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లా మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే స్పందించి అక్రమార్కుల చెర నుంచి మమ్మల్ని రక్షించాలి" అని బాధిత రైతులు మీడియా ముఖంగా రెండు చేతులెత్తి వేడుకున్నారు. ఈ మీడియా సమావేశంలో బాధిత రైతులు జంగాల వెంకటేశ్వరరావు, మళ్లా వెంకటేశ్వరరావు, మళ్లా కమల, బొగ్గం శివ, బొగ్గం రాజు, గోళ్ల భవాని కృష్ణ, గట్ల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story