ఆదివాసీల ఆగ్రహం.. చిన్నజీయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

by Disha Web Desk 19 |
ఆదివాసీల ఆగ్రహం.. చిన్నజీయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
X

దిశ, కొత్తగూడ: ఆదివాసీ ప్రజల ఆరాధ్యదైవాలైన మేడారం సమ్మక్క, సారక్క దేవతలను కించపరుస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా (ఏఈడబ్ల్యూసీఏ) ఉద్యోగ సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో కొత్తగూడ గాంధీనగర్‌లో చిన్న జీయర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చిన్న జీయర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండలు వేసి, చెప్పు దెబ్బలు కొట్టారు. అగ్రకులాల అహంకారాన్ని ప్రదర్శిస్తూ చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు ఏటా లక్షల మంది హాజరవుతున్న సంగతి తెలిసిందే.

కాగా, గడచిన కొన్ని ఏండ్లుగా ఊహించని రీతిలో మేడారం శ్రీ సమ్మక్క, సారక్కలను దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో చిన జీయర్ 'సమ్మక్క సారక్కలు బ్రహ్మలోకం నుండి ఊడి పడ్డారా.. వాళ్ళు అడవి దేవతలు' అంటూ తక్కువ చేసి మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చిన్నజీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరపై వ్యాపారమయం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ మహిళలు, నవోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు, దొర పటేల్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story