తెరుచుకున్న కామాఖ్య ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తజనం!

by Malleboina Mahesh |

అస్సాం కామాఖ్య ఆలయంలో ముగిసిన అంబూబాచి మహాయోగం.. నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న గర్భాలయ తలుపులు.. పోటెత్తిన భక్తులు!

తెరుచుకున్న కామాఖ్య ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తజనం!
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాంలోని గువాహటిలో కొలువైన ప్రసిద్ధ నీలాచల్ పర్వతాలపైన ఉన్న కామాఖ్య దేవి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే నాలుగు రోజుల ‘అంబూబాచి మహాయోగం’ (Ambubachi Mahayog) ఉత్సవాలు ముగియడంతో, ఈరోజు ఆలయ ప్రధాన గర్భాలయ తలుపులను అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు, సాధువులు తెల్లవారుజాము నుండే ఆలయ ప్రాంగణానికి పోటెత్తారు.

సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న కామాఖ్య ఆలయంలో.. దేవి వార్షిక రుతుస్రావ సమయాన్ని పురస్కరించుకుని ఈ నాలుగు రోజుల పాటు గర్భాలయ తలుపులను పూర్తిగా మూసివేస్తారు. ఈ సమయంలో ఆలయంలో ఎలాంటి పూజలు, దర్శనాలు ఉండవు. ఉత్సవాల ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక స్నానాలు, తాంత్రిక పూజలు, శుద్ధి కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అస్సాం ప్రభుత్వం, ఆలయ బోర్డు విస్తృతమైన భద్రతా, సేవా ఏర్పాట్లను చేశాయి.

Next Story