పొలం నుంచి వస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఎడ్లబండిని ఢీకొట్టడంతో రైతు మృతి

by Jakkula.Mamatha |

మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.

పొలం నుంచి వస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఎడ్లబండిని ఢీకొట్టడంతో రైతు మృతి
X

దిశ, మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందగా, ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎడ్లబండిలో ఉన్న ఓ బాలుడు గాయపడిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మద్ది మల్లేష్(40) తన వ్యవసాయ పొలం నుంచి ఎడ్లబండిపై ఓ బాలుడిని తీసుకుని ఇంటికి వస్తుండగా, ఇంటి సమీపంలోకి రాగానే చండూరు వైపు నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఎడ్లబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మల్లేష్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదంలో బాలుడికి కూడా గాయాలు కాగా, చికిత్స అందిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలి పరారైనట్లు తెలిపారు. కారులో మద్యం సీసాలు కనిపించడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Next Story