టీడీపీ vs వైసీపీ.. తాడిపత్రిలో హైటెన్షన్

by Malleboina Mahesh |

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల పోటాపోటీ సవాళ్లు.. వైఎస్సార్‌సీపీ దీక్షల నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు!

టీడీపీ vs వైసీపీ.. తాడిపత్రిలో హైటెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు (High Tension) నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో పట్టణంలో పోటాపోటీ ఆందోళనలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా వైఎస్సార్‌సీపీ నేత కేశవరెడ్డిపై జరిగిన దాడి, అలాగే ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న రాళ్ల దాడుల ఘటనలతో పట్టణంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది.

దీనికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు 'సామూహిక నిరాహార దీక్ష'కు పిలుపునిచ్చాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. అయితే, పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకుని ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. దీంతో తాడిపత్రి వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించి, భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.

Next Story