- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలుపు తిరిగిన కాపర్ వైర్ మాయం వ్యవహారం.. సెక్యూరిటీ నివేదికతో కొత్త కోణం వెలుగులోకి!
సింగరేణి కార్పొరేట్ పరిధిలో బ్రిటిష్ కాలం నాటి విలువైన కాపర్ వైర్ మాయం వ్యవహారం సింగరేణి వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: సింగరేణి కార్పొరేట్ పరిధిలో బ్రిటిష్ కాలం నాటి విలువైన కాపర్ వైర్ మాయం వ్యవహారం సింగరేణి వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2023లో గాలి దుమారం, వర్షాల కారణంగా షార్ట్ సర్క్యూట్‌లు చోటుచేసుకోవడంతో భజన మందిర్ నుంచి సింగరేణి బంగ్లోస్ వరకు ఉన్న విద్యుత్ లైన్లలోని కాపర్ వైర్‌ను తొలగించినట్లు సమాచారం. సుమారు మూడు వేల మీటర్ల పొడవు,టన్ను నుంచి రెండు టన్నుల వరకు బరువున్న ఈ కాపర్ వైర్‌ను సంబంధిత పిట్ స్టోర్‌కు తరలించకుండా సంబంధిత అధికారులు మాయం చేశారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై ' దిశ ' పత్రిక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరుస కథనాలు ప్రచురించగా, అనంతరం సంస్థ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభమైన కొద్ది రోజులకే అప్పటి సంబంధిత డివిజన్‌లో పనిచేసిన ఒక ఉన్నతాధికారిని మరో విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం. అయితే అదే వ్యవహారంలో మరో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోల్ ఇండియాలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ అధికారి అండదండలు వీరికి ఉండటంతో ప్రస్తుతం కాపర్ చోరీ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులపై సింగరేణి సంస్థ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సింగరేణి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాపర్ వైర్ మిస్సింగ్ అంశంలో సంబంధం ఉండి ఈ నెలలో రిటైర్ కాబోతున్న ఓ అధికారిని కాపాడేందుకు మరి కొంతమంది సింగరేణి అధికారులు అంతా ఏకమై ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సింగరేణి కార్మికులు ఆరోపిస్తున్నారు.
విచారణ అధికారికే బదిలీ..?
సింగరేణి సంస్థలో ఏ అధికారి, ఏ సిబ్బంది పైన ఏ చిన్న ఆరోపణలు వచ్చినా దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారించి ఆ అంశంపై నివేదిక తయారు చేసి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ పెద్ద మొత్తంలో సంస్థకు నష్టం చేకూర్చే పనిని చేపట్టిన అధికారుల పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్న విజిలెన్స్ విభాగంలోని ఒక నిజాయితీ గల అధికారిని ఆఘమేఘాల మీద అకస్మాత్తుగా రిక్రూట్ మెంట్ సెల్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. విచారణ కీలక దశలో ఉండగానే ఈ మార్పు చోటుచేసుకోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పాత సంతకాలతో రికార్డుల సృష్టి ఆరోపణలు
ఈ కుంభకోణం విచారణ నుంచి బయటపడేందుకు సంబంధిత అధికారులు అప్పటి పిట్ స్టోర్ ఇన్‌చార్జిని సంప్రదించి, పాత తేదీలతో రికార్డుల్లో కాపర్ వైర్ స్టోర్‌కు వచ్చినట్లు తమకు సహకరించాలని రికార్డులలో అదే విధంగా నమోదు చేయాలని కోరినట్లు సమాచారం. అయితే ఆ ఇంచార్జి ససేమిరా అని , సంస్థకు నష్టం చేకూర్చే పనిని తాను చేయలేనని ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా ఈ కుంభకోణం నుంచి బయటపడేందుకు 2022లో పదవీ విరమణ చేసిన మాజీ ఇన్‌చార్జి సంతకాన్ని పోర్జరీ చేసి, విలువైన కాపర్ వైర్ అప్పటికే స్టోర్‌కు చేరినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023సంవత్సరంలో తొలగించిన కాపర్ వైర్‌ను 2022లోనే స్టోర్‌కు పంపినట్లు చూపించేలా రికార్డులలో నమోదు చేయడం ద్వారా విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే కాకుండా మరికొన్ని పత్రాలు కూడా తర్వాత ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మెయిన్ వర్క్ షాప్ అధికారులు సృష్టించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెక్యూరిటీ నివేదికలో ఏముంది..?
ఏప్రిల్ నెల నుంచి కొనసాగుతున్న విచారణలో భాగంగా సింగరేణి సెక్యూరిటీ విభాగం సమర్పించిన నివేదిక కీలకంగా మారినట్లు తెలుస్తోంది. కాపర్ వైర్ అసలు పిట్ స్టోర్‌కు చేరలేదని, చోరీ జరిగిన అవకాశాలను విస్మరించలేమని ఆ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటికే వరుస కథనాలు, అంతర్గత విచారణలు, బదిలీలు, నకిలీ రికార్డుల ఆరోపణలు నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల పూర్తి వివరణ, విచారణ నివేదిక వెలుగులోకి వస్తేనే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. మెయిన్ వర్క్ షాప్ లో అధికారులు తమ పలుకుబడిని అస్త్రశస్త్రాలు ఉపయోగించి ఈ కుంభకోణం నుండి ఎలాగైనా బయటపడాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. సంస్థలో కార్మికుడు ఏదైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడని ఉన్నతాధికారులు , అధికారులు తప్పు చేస్తే వెనకేసుకు వస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపర్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై చర్యలు తీసుకొని కాపర్ వైర్ ను రికవరీ చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై విజిలెన్స్ జిఎంను వివరణ కోరేందుకు ' దిశ' ప్రతినిధులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.






