ఝరాసంగం మండలంలో భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-26 05:44:28  IST  )

మానవత్వం, న్యాయం, ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించిన మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఝరాసంగం మండలంలో భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు..!
X

దిశ, ఝరాసంగం: మానవత్వం, న్యాయం, ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించిన మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ శుక్రవారం మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్, కుప్పానగర్, కృష్ణాపూర్, మచునూర్, పొట్టిపల్లి, ఝరాసంగం, సంఘం(కె), తుమ్మనపల్లి, గుంటమర్పల్లి, ఈదులపల్లి, చిల్లేపల్లి, సిద్దాపూర్ తదితర గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హసన్, హుస్సేన్, బీబీ ఫాతిమా, జల్సా కర్, ఇమామ్ ఖాసిం, సిద్ది సాహెబ్ తదితర పీర్లను దట్టీలతో అందంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లు, భక్తుల నినాదాలతో గ్రామాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మొహర్రం వేడుకల్లో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. భక్తులకు తాగునీరు, శర్బత్ పంపిణీ చేశారు. మహిళలు పీర్లకు హారతులతో ఘన స్వాగతం పలికారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Next Story