- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కురుక్షేత్రానికి ‘త్రిశూల వ్యూహం’.. ‘2029’ టార్గెట్‌గా కేంద్రం పావులు!
ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బకొట్టి ఢిల్లీ పీఠాన్ని మరోసారి చేజిక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నంచే వ్యూహాలకు పదునుపెడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఎన్నికల దెబ్బతో అలర్ట్ అయిన కేంద్రంలోని ఎన్డీయే (NDA) సర్కారు.. 2029 పీఠమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సరికొత్త మైండ్ గేమ్‌కు తెరలేపిందా అంటే ఔననే సమాధానాలే వస్తున్నాయి. శతాబ్దాల నాటి పొలిటికల్ సెంటిమెంట్లను వదిలి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీసేందుకు సర్ (SIR), డీలిమిటేషన్, మహిళా కోటా అనే త్రిశూల వ్యూహాన్ని సిద్ధం చేసిందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో, ఇటీవల బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రయోగించిన ఫార్ములానే ఇప్పుడు దేశం మొత్తం అమలు చేసి విపక్షాలను మళ్లీ కోలుకోకుండా దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
‘సర్’ పేరిట ఓట్ల జల్లెడ..
అయితే, రెండు దశాబ్ధాల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను చేపట్టింది. ప్రతి ఏటా జరిగే సాధారణ ఓటర్ల సవరణ (SSR) లాంటిది కాకుండా, ఇందులో ప్రతి ఓటరూ వ్యక్తిగతంగా ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఉద్దేశించిన ఈ సర్వే ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే, ఈ ప్రక్రియ అంతా విపక్షాల ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకేనని కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీలు మండిపడుతున్నాయి. ‘సర్’తో ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 2.89 కోట్లు, లక్నోలో 30 శాతం, వెస్ట్ బెంగాల్‌లో 22 శాతం ఓట్లు ఓటరు లిస్ట్ నుంచి మాయం అవ్వడం కలకలం రేపింది. అంతకుముందు బీహార్‌లో 50 లక్షల ఓట్లు గల్లంతవడంపై పార్లమెంట్ దద్దరిల్లింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల్లో టెన్షన్..
ప్రస్తుతం దేశంలో మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ 3వ దశ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను ధృవీకరించడానికి 35 వేల మందికి పైగా బీఎల్ఓలను రంగంలోకి దిగారు. జూలై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఇక హైదరాబాద్‌లోని పాతబస్తీ మైనారిటీ ఓట్లు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్న దాదాపు 15 లక్షల మంది సీమాంధ్ర ఓటర్ల భవితవ్యంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నియమ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలి కాబట్టి, వాటిని గంపగుత్తగా తొలగిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు నియోజకవర్గాల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఈ ‘సర్’ ఇంపాక్ట్ రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ అధికారాన్ని సైతం మార్చేలా ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.
‘డీలిమిటేషన్’ రచ్చ..
కేంద్ర అధికారంలో బీజేపీ సర్కార్ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)ను ఎలాగైనా చేపట్టాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లను 850కి పెంచేందుకు కేంద్రం ముసాయిదా సిద్ధం చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. విపక్షాలు ఐక్యంగా కలిసిరావడంతో అది కాస్త వీగిపోయింది. అయితే, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు ఏకంగా 230 సీట్లు పెరిగి భారీగా లబ్ధి పొందుతాయి. అదే సమయంలో జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉంది. ఇక్కడి 5 రాష్ట్రాల్లో కలిపి పెరిగేది కేవలం 66 సీట్లు మాత్రమే పెరిగే చాన్స్ ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల సాయం లేకుండా కేవలం ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో పీఠం దక్కించుకునేలా బీజేపీ పావులు కదుపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలాగైన డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించేందుకు పార్లమెంట్‌లో అధికార పక్షం తమ సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ తెరలేపింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు తమ మద్దతును ఎన్డీఏకు ప్రకటించారు. అదేవిధంగా ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)కి చెందిన 6 మంది ఎంపీలు పార్టీ ఫిరాయింపజేసి, ఏక్‌నాథ్ షిండే వర్గం ద్వారా ఎన్డీఏతో చేతులు కలిపేలా చేశారు. ఇలా భవిష్యత్తులో ఇలా విపక్ష సభ్యులు ఖాళీ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
‘మహిళా రిజర్వేషన్’ అస్త్రం.. విపక్షాలకు చెక్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వాలని 2023లోనే చట్టం చేసినప్పటికీ, డీలిమిటేషన్ ప్రక్రియ ముగిశాకే ఇది అమల్లోకి వస్తుందని నిబంధన పెట్టారు. 2029 ఎన్నికల్లో ఈ కోటాను అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా చట్టంలోని సెక్షన్-5ను సవరించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాస్ అయిన మహిళా బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లగా.. ఇదేంటని విపక్షాలు దీనికి అడ్డుపడితే, కాంగ్రెస్ కూటమి మహిళా వ్యతిరేకి అని ప్రచారం చేసి ఎన్డీఏ కూటమి మహిళల్లో సానుభూతిని సంపాదించి మరో వ్యూహాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేసింది. అయితే.. రామ మందిరం, హిందుత్వ సెంటిమెంట్‌కు కాలం చెల్లిందని గ్రహించిన ఎన్డీయే సర్కారు చట్టాలు, ఓటర్ల ప్రక్షాళనను నమ్ముకుని ఈ త్రిశూల వ్యూహానికి పదులను పెడుతుందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కానీ, 2029లో బీజేపీని అదే వ్యూహం వారిని గట్టెక్కిస్తుందా.. లేక నిండా ముంచేస్తుందా వేచి చూడాల్సిందే మరి.






