తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్క మృతిపై ఫోరెన్సిక్ నివేదిక

by Malleboina Mahesh |

తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: పెంపుడు కుక్క అనారోగ్యంతోనే చనిపోయిందని తేల్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక.. చిన్నారి కోసం గాలింపు ముమ్మరం!

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్క మృతిపై ఫోరెన్సిక్ నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలు గత 23 రోజులుగా తుని చిన్నారి జాను మిస్సింగ్ (Janu missing) పైనే చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధారంగా భావించిన వారి పెంపుడు కుక్క (pet dog) మృతిపై సస్పెన్స్ వీడింది. సదరు పెంపుడు కుక్క ఎలాంటి విషప్రయోగానికి గురికాలేదని, అది కేవలం అనారోగ్యంతోనే మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక (Forensic report)లో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. జూన్ 13న కుక్క చనిపోగా, జూన్ 14న పశువైద్యులతో దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత శరీర భాగాలను విశాఖపట్నంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (RFSL) పంపించారు.

ల్యాబ్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. ఆ పెంపుడు కుక్క కొన్ని రోజులుగా సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై సహజంగానే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో కుక్కను ఎవరైనా కావాలనే చంపేసి ఉంటారనే కోణంలో సాగిన అనుమానాలకు బ్రేక్ పడింది. ఇదిలావుండగా, మిస్సింగ్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను, స్థానికుల కదలికలను పరిశీలిస్తూ, అటవీ ప్రాంతంలో గాలిస్తూ.. అన్ని కోణాల్లోనూ గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Next Story