ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. నా ఉద్దేశం అది కాదంటూ సునీత ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

అలాగే ఆడవారిపై జరిగే దోపిడీని, వారి పట్ల కొందరు ప్రవర్తించే అనుచిత ప్రవర్తనను తాను ఎప్పుడూ సమర్థించలేదని, ఎప్పటికీ ప్రోత్సహించనని చెప్పారు.

ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. నా ఉద్దేశం అది కాదంటూ సునీత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సింగర్ సునీత ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ‘మై బాడీ మై రైట్’ అనే విషయంపై చేసిన కామెంట్స్‌‌కు కొందరు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలను అగౌరవపరిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో రియాక్ట్ కావడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సునీత పట్ల తనకు గౌరడం ఉన్నప్పటికీ.. అలాంటి వ్యాఖ్యలు మహిళల హక్కులకు వ్యతిరేకంగా అర్థమయ్యే అవకాశం ఉందని అన్నారు. మహిళల శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వారికే ఉంటుందని అన్నారు. తాజాగా, ఈ వివాదానికి చెక్ పెడుతూ.. సునీత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు సమాజంలో కొంతమంది కామాంధులైన మగవాళ్లు స్త్రీలను చూసే తీరుపై తనకు కలిగిన తీవ్రమైన కోపం, బాధ, నిరాశతో అన్న మాటలు మాత్రమేనని ఆమె వివరించారు. అంతేకానీ, స్త్రీలను అగౌరవపరచడం గానీ, వారిపై నిందలు వేయడం గానీ తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

అలాగే ఆడవారిపై జరిగే దోపిడీని, వారి పట్ల కొందరు ప్రవర్తించే అనుచిత ప్రవర్తనను తాను ఎప్పుడూ సమర్థించలేదని, ఎప్పటికీ ప్రోత్సహించనని చెప్పారు. ఒక మహిళగా తాను ఎల్లప్పుడూ మహిళల సమాన హక్కులను, సమాన అవకాశాలను, వారికి దక్కాల్సిన గౌరవాన్ని బలంగా నమ్ముతానని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పరిస్థితిలోనూ ఒక మహిళకు హాని కలిగించే లేదా కించపరిచే ఏ విషయాన్నైనా తాను ఎన్నటికీ ఒప్పుకోనని, సహించనని ఆమె తేల్చి చెప్పారు. అలాగే తన మాటలను వివాదం చేయవద్దని కోరుతూ.. తన మాటలను తాను ఏ సందర్భంలో అన్నానో అలాగే అర్థం చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేశారు. తాను అనని అర్థాలను తన మాటలకు ముడిపెట్టవద్దని కోరారు. తన జీవిత విలువలు ఎప్పటికీ మారవని.. సమానత్వం, గౌరవం, మహిళలపై జరిగే అన్యాయం, దోపిడీల పట్ల తనకున్న వ్యతిరేకత ఎప్పటికీ అలాగే ఉంటుందని సునీత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో వివాదానికి కాస్త చెక్ పడినట్లు అయింది.




Next Story