‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఆరుగురు అమరవీరులు.. పేర్లను తొలిసారి ప్రకటించిన కేంద్రం

by Kema Shiva Kumar |

భారత సైన్యపు అత్యంత సాహసోపేతమైన 'ఆపరేషన్ సింధూర్' వీరులకు అరుదైన గౌరవం దక్కింది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఆరుగురు అమరవీరులు.. పేర్లను తొలిసారి ప్రకటించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతికారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకం (National War Memorial) లోని ప్రత్యేక గ్రెనైట్ పలకలపై వీరి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు.

వీరమరణం పొందిన ఆ ఆరుగురు వీరే..

ఆపరేషన్ సింధూర్‌లో శత్రువులతో వీరోచితంగా పోరాడుతూ.. భారత సైన్యానికి చెందిన ఐదుగురు, భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఒక సర్జెంట్ వీరమరణం పొందారు. వారిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, హెడ్‌క్వార్టర్స్ 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, 4వ బెటాలియన్, జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్ – 5 ఫీల్డ్ రెజిమెంట్, అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్ – 851 లైట్ రెజిమెంట్ (తెలుగు రాష్ట్రానికి చెందిన వీరుడు), హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ – 237 ఫీల్డ్ వర్క్‌షాప్, సర్జెంట్ సురేంద్ర కుమార్ – 39 వింగ్, భారత వైమానిక దళం (IAF) ఉన్నారు. అయితే, ఆపరేషన్ సింధూర్ లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గానూ రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశపు మూడవ అత్యున్నత సైనిక పురస్కారమైన ‘వీరచక్ర’ (Vir Chakra)ను ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా, భారత వైమానిక దళానికి చెందిన సర్జెంట్ సురేంద్ర కుమార్‌కు మరణానంతరం ‘వాయుసేన మెడల్’ (Vayu Medal) బహుకరించి గౌరవించింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ యుద్ధ స్మారకం వద్ద త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Next Story