- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులా భూకంపం: 235 కు పెరిగిన మృతుల సంఖ్య
వెనిజులా జంట భూకంపాల్లో మృతుల సంఖ్య 235కు చేరింది. 4,300 మందికి పైగా గాయాలు.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో జూన్ 24 (బుధవారం) రాత్రి వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ జంట భూకంపాలు (Twin Earthquakes) సృష్టించిన బీభత్సం నుంచి ఆ దేశం ఇంకా కోలుకోలేదు. వందలాది భవనాలు నెల కూలడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నిమిష నిమిషానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం రాత్రికి 188 మంది చనిపోగా ఈ సంఖ్య శుక్రవారం ఉదయానికి 235 కు పెరిగింది. తీవ్రంగా గాయపడిన 4,300 మందికి పైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెనిజులా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుప్పకూలిన వందలాది బహుళ అంతస్తుల భవనాల శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూఎస్‌జీఎస్ (USGS) ఆందోళన వ్యక్తం చేసింది.
శతాబ్దంలోనే అత్యంత దారుణమైన విపత్తు
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం కోస్టల్ రీజియన్‌లోని మొరాన్ సమీపంలో 7.2, 7.5 తీవ్రతతో ఈ భూకంపాలు సంభవించాయి. రాజధాని కారకస్‌తో పాటు లా గుయైరా, బరుటా, చాకావో వంటి నగరాల్లో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు చూస్తుండగానే కుప్పకూలాయి. ప్రస్తుతం ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహా రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా టార్చ్ లైట్ల వెలుతురులో శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు. తాజా పరిస్థితిపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ స్పందిస్తూ తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ (విపత్తు జోన్) ప్రకటించారు. కాగా, ఈ విపత్తు తీవ్రతను గమనించిన ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ.. వెనిజులా అంతటా ఉచిత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాతో పాటు పలు అంతర్జాతీయ దేశాలు వెనిజులాకు అత్యవసర సాయాన్ని అందిస్తున్నాయి.






