- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరేడుచర్లలో మద్యం మత్తులో డీసీఎం బీభత్సం.. మహిళను ఢీకొట్టి పరారీ!
మద్యం మత్తులో ఉన్న ఓ డీసీఎం డ్రైవర్ గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో బీభత్సం సృష్టించాడు.

దిశ, నేరేడుచర్ల/గరిడేపల్లి: మద్యం మత్తులో ఉన్న ఓ డీసీఎం డ్రైవర్ గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో బీభత్సం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. గరిడేపల్లి మండలం గుండాలమిట్ట ప్రాంతంలో వేగంగా వెళ్తున్న డీసీఎం ముందుగా బొగ్గు లారీని, అనంతరం ఓ హోంగార్డుకు చెందిన కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా మితిమీరిన వేగంతో ముందుకు దూసుకెళ్లాడు. డీసీఎం ఒకవైపు డోర్ భాగాలు, ఇనుప కడ్డీలు కింద వేలాడుతూ ఉండగా తుమ్మాయిగడ్డ ప్రాంతంలో రమణమ్మ అనే మహిళకు అవి తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ పట్టించుకోకుండా పరారయ్యాడు.
స్థానికులు వెంటనే నేరేడుచర్ల ఎస్సై సైదిరెడ్డికి సమాచారం అందించారు. స్పందించిన ఎస్సై సైదిరెడ్డి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి వివిధ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నేరేడుచర్ల పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుకు మళ్లిన డీసీఎంను గంగమ్మ గుడి సమీపంలో పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో డీసీఎంను నిలిపివేసిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, వాహనంతో సహా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి అప్పగించారు. నేరేడుచర్ల ఎస్సై సైదిరెడ్డి, పోలీసు సిబ్బంది సకాలంలో స్పందించడంతో మరో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఘటనపై గరిడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.






